Begin typing your search above and press return to search.

దేశాన్నిఅవమానించటం భావవ్యక్తీకరణ స్వేచ్ఛా అసద్?

By:  Tupaki Desk   |   17 March 2016 7:12 AM GMT
దేశాన్నిఅవమానించటం భావవ్యక్తీకరణ స్వేచ్ఛా అసద్?
X
ఎవరినైనా అమ్మను గౌరవించను.. మర్యాదగా చూడనంటే ఏం చేయాలి? దానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్న ట్యాగ్ కడితే ఏం చేయాలి? అలాంటి వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు ఉండవా? లాంటి ప్రశ్నలు ప్రస్తుతం మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీరు చూస్తున్న వారికి కలుగుతున్న సందేహాలు. తమ పార్టీకి చెందిన మహారాష్ట్ర ఎమ్మెల్యే వారిన్ పఠాన్.. భారత్ మాతాకీ జై అన్న నినాదం చేయనందుకు మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయటంపై అసద్ ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు చూస్తే షాకింగ్ గా అనిపించక మానదు.

ఒక దేశ పౌరుడిగా.. ఒక చట్టసభలో సభ్యుడైన వ్యక్తి తన దేశాన్ని గౌరవించటం అన్నది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ‘‘భారత్ మాతా కీ జై’’ అన్న మాటలో ఎవరికి కనిపించని బూతును అసద్ కు కనిపించటం.. తన గొంతు మీద కత్తి పెట్టినా తన నోటి నుంచి ఆ నినాదం రాదంటూ వివాదాస్పద వ్యాఖ్య చేసిన అదస్ ను ఆయన పార్టీ నేతలు ఫాలో కావటం.. ఆ తిక్క వేషాలు మహారాష్ట్ర అసెంబ్లీలో వేయటం.. దానికి అక్కడి స్పీకర్ ఒళ్లు మండి సస్పెన్షన్ వేటు వేయటం తెలిసిందే.

ఒక నినాదం చేయనందుకు ఎన్నికైన ఒక సభ్యుడిని సస్పెండ్ చేయటం భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే తొలిసారి అంటూ అసద్ వ్యాఖ్యానించారు. నిజమే.. స్వతంత్ర భారతదేశ చరిత్రలో దేశమాతకు జై చెప్పటానికి నిరాకరించన చట్టసభ సభ్యుడు కూడా అసద్ అవుతాడని మర్చిపోకూడదు. ఒక సభ్యుడు అమర్యాదకర భాషను వినియోగించినా.. వ్యవహరించినా సస్పెండ్ చేసే విచక్షణాధికారం స్పీకర్ కు ఉంటుందే తప్ప.. ఒక నినాదం చేయని వ్యక్తిని సస్పెండ్ చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని అసద్ వాదిస్తున్నారు.

నిజమే.. రాజ్యాంగ నిర్మాతలు ఎవరూ కూడా..అసద్ లాంటి నేతలు భవిష్యత్తులో చట్టసభల్లోకి అడుగు పెడతారని.. దేశమాతను గౌరవించేలా నినాదం చేయటానికి కూడా మొండికేస్తారని.. ఆయన్ను ఫాలోఅయ్యే మరికొందరు నేతలు ఉంటారని ఊహించి ఉండరు. ఒకవేళ ఊహించి ఉంటే.. పెద్ద శిక్షనే వేయాలని రాసి ఉండేవాళ్లేమో. కన్న తల్లిని గౌరవించని వ్యక్తి ఎంత ప్రమాదకరమైన వ్యక్తో.. దేశాన్ని గౌరవించకపోవటం అంతే పెద్ద నేరంగా చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సి ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ఎందుకంటే.. అసద్ లాంటి నేతలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే.. ప్రపచంలో ఏ దేశంలోనూ లేని భావస్వేచ్ఛ ఈ దేశంలో ఉండటం.. అందులోనూ కొన్ని ట్యాగులు కట్టుకు తిరిగే వారికి ఈ దేశంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించే వీలున్న నేపథ్యంలో చట్టాలు మారాల్సిన అవసరం ఎంతైనా ఉందనటంలో మరో సందేహం లేదు.