Begin typing your search above and press return to search.

బుర్ఖాలతోపాటు పరదాలు నిషేధించండి

By:  Tupaki Desk   |   1 May 2019 10:12 AM GMT
బుర్ఖాలతోపాటు పరదాలు నిషేధించండి
X
దేశంలో ఎన్నికల వేళ మాటల మంటలు చెలరేగుతున్నాయి. బీజేపీ మిత్రపక్షం శివసేన దేశంలో బుర్ఖాలను నిషేధించాలని బీజేపీని డిమాండ్ చేసిన ప్రకటన ఇప్పుడు కాకరేపుతోంది. రాజకీయాల్లో లబ్ధి పొందేందుకు శివసేన వేసిన ఈ ఎత్తుగడపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శివసేన డిమాండ్ పై ముస్లింలంతా భగ్గుమంటున్నారు.

శ్రీలంకలో ఐఎస్ ఐఎస్ మానవబాంబులతో విరుచుకుపడి 300మంది ప్రాణాలు తీయడం.... బుర్ఖాలతోనే తీవ్రవాదులు తప్పించుకుంటున్నారన్న నిఘావర్గాల సమాచారం మేరకు బుర్ఖాను ఆ దేశంలో శాశ్వతంగా నిషేధించింది లంక ప్రభుత్వం. ఇప్పుడు లంక నిర్ణయాన్ని కూడా మహారాష్ట్రకు చెందిన శివసేన ఎన్నికల వేళ క్యాష్ చేసుకుందామని ప్రయత్నించింది.. భారత్ లోనూ బుర్ఖాను నిషేధించాలని.. లంకను ఫాలో అవ్వాలని మోడీకి తాజాగా శివసేన అల్టీమేటం జారీ చేసింది.

శివసేన చేసిన ఈ డిమాండ్ ను మజ్లిస్ అధినేత - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా తప్పుపట్టాడు. బీజేపీ ,శివసేన అతివాద లక్షణాలకు ఇదే ఉదాహరణ అన్నారు. పరదాల రూపంలో హిందువులు కూడా పెళ్లిళ్లలో ముఖాన్ని దాచుకుంటారని.. ఈ సంప్రదాయాన్ని కూడా నిషేధించాలని డిమాండ్ చేయగలరా అని శివసేనను ఓవైసీ ప్రశ్నించారు.

బుర్ఖాలను ధరించడం రాజ్యాంగబద్దమేనని.. ఈ రక్షణను ఎప్పుడో కల్పించారని ఓవైసీ చెప్పుకొచ్చారు. శివసేన ప్రకటన రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనన్నారు. ఎన్నికల నియమావళిని కూడా శివసేన ఉల్లంఘించిందని.. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక హక్కులను కాలరాసే హక్కు ఎవరికీ లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇచ్చిందని ఓవైసీ శివసేనకు కౌంటర్ ఇచ్చారు.