Begin typing your search above and press return to search.

కశ్మీర్ బిల్లుపై అసద్ ఫైరింగ్ మామూలుగా లేదుగా!

By:  Tupaki Desk   |   6 Aug 2019 4:23 PM GMT
కశ్మీర్ బిల్లుపై అసద్ ఫైరింగ్ మామూలుగా లేదుగా!
X
జమ్మూ కశ్మీర్ విభజనకు సంబంధించి నరేంద్ర మోదీ సర్కారు వ్యూహం బాగానే వర్కవుట్ అయినా... మోదీ వ్యూహం - కశ్మీర్ విభజన కోసం కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లుపై మజ్లిస్ అధినేత - హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సోమవారమే రాజ్యసభలో కశ్మీర్ విభజన బిల్లుకు ఆమోదం లభించినా... మంగళవారం లోక్ సభలో ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఇతర పార్టీల సభ్యుల నుంచి మోదీ సర్కారు కాస్తంత ప్రతిఘటనను ఎదుర్కొందని చెప్పక తప్పదు. ఈ చర్చలో అసదుద్దీన్ ఓవైసీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కారు తనదైన ఒంటెత్తు పోకడలు పోతోందని - దేశంలో ఏ ఒక్క వర్గాన్ని కూడా సంప్రదించడానికి సుముఖంగా లేని మోదీ సర్కారు... తాను అనుకున్న పనిని ఏ ఒక్కరి సమ్మతి అవసరం లేకుండానే చేసుకుపోతోందని మండిపడ్డారు.

ఈ సందర్భంగా కశ్మీర్ విభజన బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన అసద్... దేశాన్ని కశ్మీరైజేషన్ చేస్తారా? అంటూ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని, దీనిని సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని ఆయన ప్రకటించారు. మోదీ సర్కారు దుందుడుకు చర్యలతో దేశంలో ఫెడరలిజానికి అర్థం లేకుండా పోయిందని వాపోయారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి మోదీ సర్కారు చారిత్రక తప్పిదం చేసిందని, రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించారు. ఆర్టికల్‌ 370 తాత్కాలికమైనది ఎంతమాత్రం కాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగానే ఆయన కాస్తంత కటువైన పదాలనే వాడారు. దేశాన్ని మోదీ సర్కారు కశ్మీరైజేషన్‌ చేయడం మనమంతా చూస్తున్నామమని వ్యాఖ్యానించారు. శ్రీనగర్‌ ను వెస్ట్‌ బ్యాంక్‌ మాదిరిగా తయారు చేశారని దుయ్యబట్టారు. కశ్మీర్ ను పాలస్తీనాలా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీ పాలన నాజీ పాలనను తలపిస్తోందని కూడా అసద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బలగాల నిర్బంధం నుంచి కశ్మీరీలకు విముక్తి కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సోమవారం ఈద్‌ పండుగ జరగనుందని చెప్పిన అసద్... ఈద్ సందర్భంగా గొర్రె పిల్లలకు బదులుగా కశ్మీరీలు బలి కావాలని మోదీ సర్కారు కోరుకుంటున్నట్టుగా కనబడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తమ హక్కులను కాపాడుకునేందుకు కశ్మీరీలు త్యాగాలకు వెనుకాడబోరని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హిమాచల్‌ప్ర దేశ్‌లో తాను వ్యవసాయ భూమి కొనుగోలు చేయగలనా - లక్షద్వీప్‌ కు అనుమతి లేకుండా తనను వెళ్లనిస్తారా అంటూ ప్రశ్నలు సంధించిన అసద్... కశ్మీర్ బిల్లుపై తనదైన శైలి నిరసనను వ్యక్తం చేశారు.