Begin typing your search above and press return to search.

హ‌జ్ సబ్సిడీ ఖ‌ర్చు అయితే.. వాటి సంగ‌తేంది?

By:  Tupaki Desk   |   17 Jan 2018 4:29 AM GMT
హ‌జ్ సబ్సిడీ ఖ‌ర్చు అయితే.. వాటి సంగ‌తేంది?
X
గ‌తంలో ఏ కేంద్ర ప్ర‌భుత్వం తీసుకోలేని రీతిలో తాజాగా మోడీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. హ‌జ్ యాత్రికుల‌కు కేంద్రం ఇచ్చే స‌బ్సిడీని ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టంపై మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ మండిప‌డ్డారు. బీజేపీ.. కాంగ్రెస్ లు ముస్లింల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హ‌జ్ యాత్ర‌కు ఇచ్చే స‌బ్సిడీ తొల‌గింపుపై ఆయ‌న స్పందించారు.

హ‌జ్ స‌బ్సిడీ ర‌ద్దు నిర్ణ‌యం నేప‌థ్యంలో.. కేంద్రం.. ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు హిందూ ధార్మిక కార్య‌క్ర‌మాలు.. యాత్ర‌ల‌పై వంద‌లాది కోట్ల రూపాయిలు ఖ‌ర్చు చేయ‌టాన్ని ఆపేయాల‌న్నారు. దాదాపు 12 ఏళ్లుగా హ‌జ్ యాత్ర‌కు ఇచ్చే స‌బ్సిడీని ర‌ద్దు చేయాల‌ని తాము అడుగుతున్న‌ట్లుగా చెప్పారు. 2006 నుంచి తాము హ‌జ్ స‌బ్సిడీని ర‌ద్దు చేయాల‌ని కోరామ‌ని.. అయితే.. ఇప్పుడు ఒక్క హ‌జ్ యాత్ర‌పై స‌బ్సిడీ ఒక్క‌దాన్నే ఎందుకు ర‌ద్దు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు.

హ‌జ్ స‌బ్సిడీ ర‌ద్దు నిర్ణ‌యం తీసుకున్న వేళ‌.. హిందూ ధార్మిక కార్య‌క్ర‌మాలు.. యాత్ర‌ల‌పై చేస్తున్న ఖ‌ర్చుల్ని నిలిపివేయాల‌ని డిమాండ్ చేశారు. హ‌జ్ యాత్ర‌కు ఇచ్చే రూ.200 కోట్ల రాయితీనే క‌నిపిస్తుందా? అని ప్ర‌శ్నించిన అస‌ద్‌.. ఉజ్జ‌యిని మ‌హాకుంభ‌మేళాకు కేంద్రం రూ.1150 కోట్లు ఖ‌ర్చు చేస్తుంద‌ని.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రూ.3400 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నాయ‌ని.. మాన‌స‌స‌రోవ‌ర్ యాత్ర‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని యోగి స‌ర్కారు ఒక్కొక్క‌రిపైనా రూ.1.5ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు చెప్పారు.

ఇక‌.. రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం కేవ‌లం మందిరాల నిర్మాణం కోసం రూ.216 కోట్లు మంజూరు చేసింద‌ని.. మ‌రి వాటి సంగ‌తేంటంటూ లెక్క‌లు పంచాయితీ మొద‌లు పెట్టారు. హ‌జ్ స‌బ్సిడీ అన్న‌ది వ్య‌క్తిగ‌తంగా క‌లిగించే ప్ర‌యోజ‌నం అన్న‌ది అస‌ద్ మ‌ర్చిపోతున్నారు. హ‌జ్ యాత్ర చేసే వారికి స‌బ్సిడీ ఇచ్చే క‌న్నా.. ఆ మొత్తాన్ని మైనార్టీల సంక్షేమానికి ఖ‌ర్చు చేస్తే బాగుంటుందన్న విష‌యాన్ని అస‌ద్ ఎందుకు ఆలోచించ‌రు? అన్న ప్ర‌శ్న‌ను ప‌లువురు సంధిస్తున్నారు. అంతేకాదు.. మాన‌స‌స‌రోవ‌ర్ యాత్ర‌కు యోగి స‌ర్కారు రూ.1.5ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు చెబుతున్న అస‌ద్‌.. ఏడాది ముందు నుంచి మొద‌లైన విధానాన్ని త‌ప్పు ప‌ట్టే ముందు.. కొన్ని ద‌శాబ్దాలుగా సాగుతున్న హ‌జ్ స‌బ్సిడీ మీద మాత్రం నోరు విప్ప‌ని వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఈ రోజు.. హ‌జ్ స‌బ్సిడీని ర‌ద్దు చేయాల‌ని తాను పుష్క‌ర కాలంగా చెబుతున్నాన‌ని చెబుతున్న అస‌ద్.. ఒక‌వేళ అదే నిజ‌మైతే.. ఈ రోజు తాను కోరుకున్న‌ది జ‌రిగిన‌ప్పుడు అంత ఆగ్ర‌హం చెంద‌టం ఎందుకంట‌?