Begin typing your search above and press return to search.

గుజ‌రాత్ పోల్స్‌ పై ఓవైసీ ఏమ‌న్నారంటే!

By:  Tupaki Desk   |   18 Dec 2017 11:42 AM GMT
గుజ‌రాత్ పోల్స్‌ పై ఓవైసీ ఏమ‌న్నారంటే!
X
గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా ఆరోసారి విజ‌య‌బావుటా ఎగుర‌వేసిన క‌మ‌ల ద‌ళం త‌మ‌కు తిరుగులేద‌ని చాటి చెప్పేసింది. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వ‌చ్చిన సీట్ల కంటే ఈ ప‌ర్యాయం కాస్తంత త‌క్కువ‌గా వ‌చ్చే అవ‌కాశాలున్న‌ప్ప‌టికీ.. వ‌రుస‌గా ఆరు సార్లు అధికారం ద‌క్కించుకోవ‌డ‌మంటే... అది కూడా బ‌ల‌మైన విపక్షం ఉన్న స‌మ‌యంలోనే ఈ త‌ర‌హా విజ‌యం ద‌క్కిందంటే గుజ‌రాత్‌ లో బీజేపీని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎంత బ‌లంగా తీర్చిదిద్దారో ఇట్టే అర్థం కాక మాన‌దు. మ‌రి వచ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ ఇవే ఫ‌లితాలు రిపీట్ అవుతాయా? అంటే.. అందులో సందేహ‌మేముంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ కోణంలోనే ఓ స‌రికొత్త వాద‌న‌ను వినిపించిన హైద‌రాబాదు పాత‌బ‌స్తీ పార్టీగా పేరున్న మ‌జ్లిస్ పార్టీ అధినేత‌ - హైద‌రాబాదు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఆస‌క్తిక‌ర వాద‌న‌ను వినిపించారు.

గుజ‌రాత్‌లో బీజేపీని ఓడించాలంటే.. ఒక్క కాంగ్రెస్ వ‌ల్ల అయ్యే ప‌ని కాద‌ని ఈ ఫ‌లితాలు తేల్చిపారేశాయ‌ని అస‌ద్ అభిప్రాయ‌ప‌డ్డారు. అయినా బీజేపీని ఓడించాలంటే... బీజేపీకి - ఆ పార్టీకి ఎదురొడ్డి నిలిచే త‌మ‌కు చాలా తేడా ఉంద‌ని చూపించాల్సి ఉంద‌ని ఆయ‌న అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీని గ‌ద్దె దించుతాన‌ని బీరాలు ప‌లికిన కాంగ్రెస్ పార్టీ... తాను బీజేపీ కంటే భిన్న‌మైన పార్టీ అని చూపించ‌డానికి బ‌దులుగా... తాను కూడా బీజేపీ లాంటి పార్టీనేన‌ని చూపించుకుంద‌ని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఓట‌మి చ‌విచూసిందని ఓవైసీ అన్నారు. ఇక త‌మ సామాజిక వ‌ర్గం ముస్లింల ప్రాధాన్యం మ‌రింత‌గా పెర‌గుతోంద‌ని గుజ‌రాత్ ఎన్నిక‌లు మ‌రోమారు రుజువు చేశాయ‌ని ఓవైసీ పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్రధాని నరేంద్ర మోదీ - కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రచారతీరుపై మాట్లాడుతూ... ఇద్దరూ ఒకే తాను ముక్కలని పేర్కొన్నారు. ఓటర్లను చేరుకునేందుకు వీరిద్దరూ ఒక మందిరం నుంచి మరొక మందిరానికి వెళ్లారని గుర్తు చేశారు. గుజరాత్‌ లో బీజేపీని ఓడించే అవకాశం కాంగ్రెస్‌ కు వచ్చిందని, కానీ హస్తం పార్టీ అందులో ఘోరంగా విఫలమైందని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో బీజేపీని ఓడించాలంటే ప్రతిపక్షాలు చేతులు కలపాలన్నారు. *అఖిలేశ్‌ యాదవ్ - మమతా బెనర్జీ - అసదుద్దీన్‌ ఒవైసీ.. విడివిడిగా బీజేపీని ఓడించలేరు. బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యకూటమి ఏర్పాటు కావాలి, అప్పుడే కమల దళాన్ని ఓడించగలం* అని అస‌ద్‌ పేర్కొన్నారు.