Begin typing your search above and press return to search.

సారీ చెప్పిన అసద్!?

By:  Tupaki Desk   |   1 Sep 2021 4:06 PM GMT
సారీ చెప్పిన అసద్!?
X
విజయమ్మ ఆహ్వానానికి ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ సారి చెప్పారట. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన విజయమ్మ హైదరాబాద్ లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పుష్కరకాలం ఎవరినీ పట్టించుకోని విజయమ్మ సరిగ్గా 12వ సంవత్సరంలోనే హైదరాబాద్ లో ఎందుకని ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ? ఎందుకని వైఎస్ క్యాబినెట్లో పనిచేసిన వారితో పాటు సన్నిహితులు, మద్దతుదారులను పిలుస్తున్నారో అర్ధం కావటంలేదు.

లాజికల్ గా అయితే విజయమ్మ హైదరాబాద్ లోఆత్మీయ సమావేశాన్ని పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విజయమ్మ సమావేశానికి పిలిచిన నేతల్లో చాలామంది వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. పైగా అప్పటి సమైక్య రాష్ట్రం ఇపుడు రెండుగా చీలిపోయింది. దీనికన్నా ఇంపార్టెంట్ ఏమిటంటే కొడుకు జగన్మోహన్ రెడ్డి ఏపి సీఎం అయితే కూతురు షర్మిల తెలంగాణాలో వైఎస్సార్టీపీని స్ధాపించారు. తెలంగాణాలో రాజన్న రాజ్యం తేవటమే తన ధ్యేయమంటు పావులు కదుపుతున్నారు.

ఇలాంటి విచిత్రమైన రాజకీయ పరిణామాల మధ్య విజయమ్మ ఆహ్వానాలు పంపటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. సుమారుగా వివిధ పార్టీల్లోని నేతలు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు వివిధ రంగాల్లోని వారు మొత్తం 300 మంది వరకు ఆహ్వానించారట. ఇలా ఆహ్వానం అందుకున్నవారిలో ఎంపి అసదుద్దీన్ కూడా ఒకరు. మిగిలిన వాళ్ళల్లో సమావేశానికి హాజరయ్యేది ఎవరు ? అనే విషయం ఇప్పటికైతే స్పష్టంగా తెలీదు. కానీ తాను మాత్రం సమావేశానికి హాజరుకానని అసద్ చెప్పేశారట.

వైఎస్సార్ తనకు సన్నిహితుడేనని, తాను కూడా వైఎస్ ను అభిమానిస్తున్నట్లు చెప్పారట. అయినా సరే తాను మాత్రం ఆత్మీయ సమావేశానికి హాజరుకాలేకపోతున్నట్లు విజయమ్మకు నేరుగానే అసద్ స్పష్టం చేసినట్లు సమాచారం. మొత్తానికి తెలుగు రాజకీయాల్లో విజయమ్మ ఆహ్వానం మాత్రం బాగా కాక రేపుతోందనే చెప్పాలి. ఏ పార్టీలో చూసినా ఇపుడు సమావేశం, ఆహ్వానం, హాజరయ్యేవాళ్ళగురించే చర్చలు జరుగుతున్నాయి.

నిజానికి ఏమాశించి విజయమ్మ ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టారో తెలీదు కానీ అందరి చూపు, పార్టీల్లోని చర్చలంతా విజయమ్మ చుట్టే తిరుగుతున్నది మాత్రం వాస్తవం. జగన్ ఎలాగూ సీఎంగా ఉన్నారు కాబట్టి కొత్తగా కొడుకును విజయమ్మ ప్రమోట్ చేసేదేమీ ఉండదు. ఏదైనా ఉంటేగింటే షర్మిల విషయంలోనే విజయమ్మ పావులు కదుపుతున్నారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి 2వ తేదీ అంటే శుక్రవారం సాయంత్రం టెన్షన్ అయితే పెరిగిపోతోందనటంలో సందేహంలేదు.