Begin typing your search above and press return to search.

అసద్ సంచలనం..లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయమంటున్నాడు

By:  Tupaki Desk   |   31 May 2020 5:30 PM GMT
అసద్ సంచలనం..లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయమంటున్నాడు
X
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ ను ఆయన తీవ్రంగా వ్యరేతికిస్తున్నారు. అంతేకాదు.. చైనాపై మోడీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. లాక్ డౌన్ కారణంగా సాధించిందేమీ లేదన్న ఆయన.. ఎలాంటి నిబంధనలు లేకుండా పూర్తిగా ఎత్తేయాలన్నారు. రెండు నెలలకు పైగా విధించిన లాక్ డౌన్ తో సాధించిందేమిటి? అని ప్రశ్నించిన ఆయన.. ఒకసారి చప్పట్లుకొట్టాలని.. మరోసారి దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చిన మోడీ.. మాయదారి రోగాన్ని అరికట్టారా? అని ప్రశ్నించారు.

లాక్ డౌన్ కారణంగా పేదలకు ఉపాధి లేకుండా చేశారని.. ఆకలిచావులు చచ్చేలా చేశారన్నారు. ఆకలితో చనిపోయిన కుక్క కళేబరాన్ని తింటున్న వైనం తనను కదిలించినట్లు చెప్పారు. లాక్ డౌన్ పేరుతో పేదల్ని నిర్బంధించి వారికి ఉపాధి లేకుండా చేశారని మోడీ సర్కారు తప్పు పట్టారు. లాక్ డౌన్ అమలుపై కేంద్రం తీరును తీవ్రంగా తప్పు పట్టిన అసద్.. చైనాతో ఉన్న సరిహద్దు వివాదంలో మోడీ సర్కారు తీరుపైనా ఆయన పెదవి విరిచారు.

లద్దాఖ్ లో చైనా బలగాలు భారత్ సరిహద్దుల వద్ద మొహరించిన వైనంపై మోడీ సర్కారు తీరు సరిగా లేదన్నారు. ఈ వ్యవహారాన్ని డీల్చేసే విషయంలో ప్రభుత్వం సిద్ధంగా ఉండాలన్నారు. భారత్ వైపు చైనా కొన్ని కిలోమీటర్ల మేర ఆక్రమించిందని.. చైనాతో మోడీ సర్కారు చర్చలు జరుపుతుంటే.. దేని గురించి మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు. గతంతో పోలిస్తే డోక్లాంలో చైనాకు చెందిన బంకర్లు పెద్దఎత్తున వెలిశాయన్నారు.

శాటిలైట్ చిత్రాలు అబద్ధాలు చెప్పవన్న అసద్.. చైనాతో సరిహద్దు సమస్యలపై ప్రధాని మోడీ తన అభిప్రాయాన్ని వెల్లడించరన్నారు. కనీసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మాట్లాడే సందర్భంలోనూ చైనా గురించి మాట్లాడటం లేదన్నారు. చైనా గురించి ప్రధాని ఎందుకు మాట్లాడరో దేశం మొత్తానికి తెలుసన్న అసద్.. ఆ విషయాన్ని మాత్రం ప్రస్తావించకపోవటం గమనార్హం.