Begin typing your search above and press return to search.

గాంధీని చంపిన వారే.. నాపైనా..: అస‌దుద్దీన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   5 Feb 2022 5:42 PM GMT
గాంధీని చంపిన వారే.. నాపైనా..:  అస‌దుద్దీన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
మహాత్మాగాంధీని హత్య చేసిన వారే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మీరట్‌లో తనపైనా హ‌త్య‌కు ప్ర‌య‌త్నించారని ఎంఐఎం చీఫ్, హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉత్తరప్రదేశ్‌ భాగ్‌పట్ జిల్లాలోని చాప్రౌలి పట్టణంలో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 3న ఒవైసీపై దాడి జరిగిన తర్వాత ఆయన పాల్గొన్న తొలి ర్యాలీ ఇదే. ఒవైసీపై దాడి ఘటనకు సంబంధించి అరెస్ట్ అయిన ఇద్దరికీ బీజేపీతో సంబంధాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

వారు తనపై నాలుగు బుల్లెట్లు కాల్చారని, కానీ అల్లా మాత్రం తనను రక్షించాలని నిర్ణయించుకున్నాడని అస‌దుద్దీన్ అన్నారు. మీరెవరూ చంపలేరని, ఎవరినీ అవమానించలేరని, ఎందుకంటే తాను అల్లా వల్లే బతికి ఉన్నానని చెప్పారు. పనిలో పనిగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌పైనా మండిపడ్డారు. ఇమ్రాన్ మసూద్‌కు సమాజ్‌వాదీ పార్టీ టికెట్ నిరాకరించడంపై మాట్లాడుతూ.. అఖిలేశ్ ఆయనను మోసం చేశారని అన్నారు. అసద్ నేడు లోని, చప్రౌలీ, గర్‌ముక్తేశ్వర్‌‌లలో ర్యాలీలు నిర్వహించారు. అయితే, ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్‌కు స్థానిక అధికారులు అనుమతించకపోవడంతో చప్రౌలీలో మాత్రమే మాట్లాడారు. మీరట్ ఘటన తర్వాత యూపీ పోలీసులు ఒవైసీకి భద్రత పెంచారు.

ఇదిలావుంటే.. ఇటీవ‌ల దాడి అనంత‌రం.. కేంద్రం ప్ర‌క‌టించిన జెడ్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను అస‌ద్ నిరాక‌రించారు. మ‌రోవైపు.. ఒవైసీ ప‌ర్య‌ట‌న‌ల‌పై కేంద్ర నిఘా బృందం దృష్టి పెట్టింది ఆయ‌న ఎక్క‌డ‌కు వెళ్లినా.. అస‌ద్‌కు తెలియ‌కుండా.. కేంద్ర బృందాలు ఆయ‌న‌ను ఫాలో అవుతున్నాయి. దీనికి.. కేంద్ర వ‌ర్గాలు..చెబుతున్న మాట‌.. భ‌ద్ర‌త కోస‌మేన‌ని. కానీ, అస‌ద్ అనుచ‌రులు మాత్రం.. త‌మ క‌ద‌లిక‌ల‌ను గుర్తించి.. త‌మ‌ను రాజ‌కీయంగా బ‌ద్నాం చేయాల‌ని చూసేందుకు కేంద్రం ప్ర‌య‌త్నిస్తోంద‌ని అంటున్నారు. ఇక‌, ఇటీవ‌ల దాడి అనంత‌రం.. అస‌దుద్దీన్ స్వ‌యంగా 50 మంది సుశిక్షితులైన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను హైద‌రాబాద్ నుంచిర‌ప్పించుకుని త‌న‌కు ప్ర‌త్యేక భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.