Begin typing your search above and press return to search.

ఇన్ని వ్యాఖ్యలు చేశావ్.. కేసీఆర్ కు ఇబ్బంది కాదా అసద్ భయ్?

By:  Tupaki Desk   |   11 Sep 2022 4:31 AM GMT
ఇన్ని వ్యాఖ్యలు చేశావ్.. కేసీఆర్ కు ఇబ్బంది కాదా అసద్ భయ్?
X
అనూహ్య వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ ఎంపీగా సుపరిచితుడైన ఆయన.. పలు రాష్ట్రాల్లో తమ పార్టీని విస్తరించాలని ప్రయత్నించటం.. హైదరాబాద్ పాతబస్తీలో ఏ ఫార్ములాను ఉపయోగించారో.. దేశంలోని లక్షిత నియోజకవర్గాలు కొన్నింటిని ఎంపిక చేసుకొని.. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పావులు కదుపుతున్నారని చెప్పాలి. తెలంగాణ అధికారపక్షానికి అత్యంత సన్నిహితుడైన అసదుద్దీన్ ఓవైసీ.. తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి.

జాతీయ పార్టీ పెట్టే దిశగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పావులు కదుపుతున్న వేళ.. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బిహార్ రాష్ట్ర సీఎం నితీశ్ తో భేటీ కావటం తెలిసిందే. వీరే కాక.. దేశంలోని వివిధ రాజకీయ పార్టీల అధినేతలతోనూ కేసీఆర్ భేటీ కావటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. కేసీఆర్ కు మిత్రులుగా భావించే నితీశ్ ను ఉద్దేశించి మజ్లిస్ అధినేత అసద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్న నితీశ్ మీద అసదు అనూహ్యరీతిలో వ్యాఖ్యలు చేశారు. గోద్రా అల్లర్ల సమయంలో బీజేపీతో ఉన్న నితీశ్ ఆ తర్వాత 2015లో విడిచి పెట్టారన్నారు. మళ్లీ 2017లో జత కట్టి 2019లో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారన్నారు. ఇప్పుడు మరోసారి బీజేపీని విడిచిపెట్టిన ఆయన తీరును ఓవైసీ తప్పు పట్టటం గమనార్హం. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైనా సెటైర్లు వేశారు.

మైనార్టీ హక్కులు.. వారి డెవలప్ మెంట్ విషయం వచ్చినప్పుడు మాట్లాడని ఈ నేతలు.. సెక్యులరిజం గురించి మాత్రం మాట్లాడతారని మండిపడ్డారు ఓవైసీ. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడన్న పేరున్న అసద్ నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావటం చూస్తుంటే.. కేసీఆర్ పెట్టే పార్టీతో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు జత కట్టే అవకాశం లేదా? అన్నది ప్రశ్నగా మారింది. తాజా వ్యాఖ్యల్ని చూస్తే.. కేసీఆర్ కు తెలిసే ఈ తరహా మాటలు అసద్ నోటి నుంచి వచ్చాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.