Begin typing your search above and press return to search.

కండోమ్‌లు ఎక్కువ‌గా వాడుతోందెవ‌రు? : ఆర్ ఎస్ ఎస్‌కు ఎంఐఎం సూటి ప్ర‌శ్న‌

By:  Tupaki Desk   |   9 Oct 2022 6:34 AM GMT
కండోమ్‌లు ఎక్కువ‌గా వాడుతోందెవ‌రు?  :  ఆర్ ఎస్ ఎస్‌కు ఎంఐఎం సూటి ప్ర‌శ్న‌
X
రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌(ఆర్ ఎస్ ఎస్‌) చీఫ్ మోహ‌న్ భాగ‌వ‌త్‌.. ఇటీవ‌ల విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా నాగ‌పూర్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో జ‌నాభా నియంత్ర‌ణ జ‌రిగి తీరాల్సిందేన‌ని .. అయితే.. అది అస‌మ‌తుల్య స్థాయిలో ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేశారు. మ‌తాల ప్రాతిప‌దిక‌న‌.. మ‌త మార్పిడుల కార‌ణంగా జ‌నాభా పెరుగుతోంద‌ని.. దీనిని ముందు అరిక‌ట్టాల‌ని.. దీనివ‌ల్లే దేశంలో విభ‌జ‌న వాదం కూడా పెరుగుతోంద‌ని అన్నారు.

అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై ఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ.. అస‌దుద్దీన్ ఓవైస్‌.. రియాక్ట్ అయ్యారు. మోహ‌న్ భాగ‌వ‌త్‌కు ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చారు. మ‌తాల ప్రాతిప‌దిక‌న జ‌నాభాలో అస‌మ‌తుల్య‌త ఉంద‌న్న వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న మండిప‌డ్డారు. ముస్లిం జ‌నాభా పెరుగుతోంద‌నే ధోర‌ణిలో భాగ‌వ‌త్ స్పందించిన తీరును ఆయ‌న తిప్పికొట్టారు. దేశంలో ముస్లిం జ‌నాభా పెర‌గ‌డం లేద‌ని.. త‌గ్గుతోంద‌ని అన్నారు. ముస్లింల జ‌న‌నాల రేటు మిగిలిన వ‌ర్గాల‌తో పోల్చుకుంటే.. త‌క్కువ‌గానే ఉంద‌న్నారు.

``జ‌నాభా కంట్రోల్ చేయాల‌ని.. భాగ‌వ‌త్ స‌ర్ చెబుతున్నారు. అస‌మ‌తుల్య‌త ఉంద‌న్న ఆయ‌న వ్యాఖ్య‌లు స‌రికాదు. కానీ, ముస్లిం జ‌నాభా పెర‌గ‌డం లేదు. పైగా.. దేశంలో ముస్లిం జ‌నాభా త‌గ్గుముఖం ప‌ట్టింది. ముస్లిం జ‌న‌నాల రేటు మిగిలిన వారికంటే.. కూడా త‌క్కువ‌గానే ఉంది. అంద‌ర‌కంటే.. ఎక్కువ కండోమ్‌లు ఎవ‌రు వాడుతున్నారు? మ‌న‌మే(హిందూ వ‌ర్గాలు). కానీ, వీటిపై మాత్రం భ‌గ‌వ‌త్ మాట్లాడ‌రు. జ‌నాభా సంఖ్య‌కు సంబంధించి.. ఏ సామాజిక వ‌ర్గం ప‌రిస్థితి ఎలా ఉంద‌నేదానిపై ఆయ‌న డేటా తెచ్చి చెప్ప‌రు`` అని ఓవైసీ విరుచుకుప‌డ్డారు.