Begin typing your search above and press return to search.

ఎంఐఎం వ‌ర్సెస్ బీజేపీ మాట‌ల యుద్ధం.. ఓ రేంజ్‌లో!

By:  Tupaki Desk   |   27 Oct 2022 3:30 AM GMT
ఎంఐఎం వ‌ర్సెస్ బీజేపీ మాట‌ల యుద్ధం.. ఓ రేంజ్‌లో!
X
హైద‌రాబాద్ కేంద్రం ఉంటూ.. దేశ‌వ్యాప్తంగా చ‌క్రం తిప్పుతున్న ఎంఐఎం పార్టీకి, బీజేపీ మ‌ధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జ‌రుగుతోంది. నువ్వా-నేనా.. అన్న‌ట్టుగా ఇరు పార్టీల మ‌ధ్య ఈ మాట‌ల యుద్ధం తార స్థాయికి చేరింది. హిజాబ్ ధరించిన యువతి భారత ప్రధానమంత్రి కావాలని తాను కాంక్షిస్తున్నట్లు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. అయితే దీనికి బీజేపీ వెంట‌నే కౌంట‌ర్ ఇచ్చింది. ఎంఐఎంకు హిజాబ్ ధరించిన యువతిని ప్రెసిడెంట్‌గా ఎప్పుడు చేస్తారని బీజేపీ ప్రశ్నించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ వాలా ట్వీట్ చేస్తూ ఒవైసీకి చురకలంటించారు. హిజాబ్ ధరించిన యువతిని ఎంఐఎంకు అధ్యక్షురాలిగా చేయకుండా ఏ రాజ్యాంగం అడ్డుకుంటోందని ప్రశ్నించారు. దీంతో ఇరు పార్టీల మ‌ధ్య కామెంట్ల కౌంట‌ర్ ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

భారత మూలాలున్న రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ దేశీయంగా రాజకీయ రగడ మొదలైంది. మతం రంగు కూడా పులుముకుంది. భారత సంతతి నేత రిషి సునాక్‌ బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికవడం గర్వకారణమని జమ్మూకశ్మీరు మాజీ సీఎం, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. 'అయితే బ్రిటన్‌ ఓ మైనారిటీ వర్గ నాయకుడిని తన ప్రధానిగా ఎన్నుకోగా.. ఇక్కడ ఎన్ఆర్‌సీ, సీఏఏ వంటి విభజన, వివక్షాపూరిత చట్టాల్లో చిక్కుకున్నాం' అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

కేంద్ర మాజీ మంత్రులు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పి.చిదంబరం, శశి థరూర్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. 'మొదట కమలా హారిస్‌.. ఇప్పుడు రిషి సునాక్‌. అమెరికా, బ్రిటన్‌ ప్రజలు తమ దేశాల్లోని మెజారిటీయేతర పౌరులను అక్కున చేర్చుకుని తమ ప్రభుత్వాల్లో అత్యున్నత పదవులకు ఎన్నుకున్నారు. భారత్‌, మెజారిటీ వాదం అనుసరించే పార్టీలు కూడా దీనిని పాఠంగా నేర్చుకోవాలి' అని చిదంబరం ట్విటర్‌లో పేర్కొన్నారు. మైనారిటీ వర్గం సభ్యుడైన రిషిని బ్రిటిషర్లు ప్రధానిగా ఎన్నుకున్నారని.. భారత్‌లో ఇలా జరుగుతుందా అని థరూర్‌ ట్వీట్‌ చేశారు.

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మెహబూబా ముఫ్తీ, పి.చిదంబరం, శశి థరూర్‌పై విరుచుకుపడ్డారు. అబ్దుల్‌ కలాం, మన్మోహన్‌సింగ్‌, రామ్‌నాథ్ కోవింద్, తాజాగా గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్ము అత్యున్నత పదవులను చేపట్టారని.. జమ్మూకశ్మీరు సీఎంగా మైనారిటీ నేతను మెహబూబా అంగీకరిస్తారా అని నిలదీశారు. చిదంబరం, థరూర్‌ వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వైరల్‌ కావడంతో ఆ పార్టీ నాయకత్వం వారిపై మండిపడింది. భారత్‌ మరే దేశం నుంచీ పాఠాలు నేర్చుకోవలసిన అవసరం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు.