Begin typing your search above and press return to search.

మోదీని టార్గెట్ చేసిన ఒవైసీ

By:  Tupaki Desk   |   24 Oct 2016 12:56 PM GMT
మోదీని టార్గెట్ చేసిన ఒవైసీ
X
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ మ‌జ్లిస్ అధినేత‌ - హైద‌రాబాదు ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ముస్లింల‌లో విడాకుల కోసం ఉద్దేశించిన ట్రిపుల్ త‌లాక్ అంశాన్నే అస్త్రంగా చేసుకున్న ఒవైసీ... మ‌హారాష్ట్ర‌లోని థానేలో జ‌రిగిన ఓ స‌మావేశంలో పాల్గొన్న సంద‌ర్భంగా మోదీకే సూటి ప్ర‌శ్న‌లు సంధించారు. ఇప్ప‌టికే ట్రిపుల్ త‌లాక్ అంశంపై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. కేవ‌లం మూడు సార్లు త‌లాక్ అని చెప్పేసి క‌ట్టుకున్న భార్య‌ల‌ను వ‌దిలేసే సంస్కృతి అత్యంత దారుణ‌మైన విష‌య‌మ‌ని ముస్లిం మ‌హిళ‌లే పెద్ద ఎత్తున గ‌ళం విప్పుతున్న వేళ... వారి మ‌నోభావాల‌ను ఏమాత్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోని ఒవైసీ చేస్తున్న వితండ వాద‌న ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ట్రిపుల్ త‌లాక్‌ ను కొన‌సాగించాల్సిందేన‌ని ఇటీవల హైద‌రాబాదులోని పాత‌బ‌స్తీలో న‌డిరాత్రి జ‌రిగిన స‌మావేశంలో ఒవైసీ గొంతు చించుకుని మ‌రీ డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే.

తాజాగా థానేలోనూ ఇదే గ‌ళాన్ని వినిపిస్తూ... ఈ ద‌ఫా ఏకంగా మోదీని టార్గెట్ చేశారు. అంతేకాకుండా ముస్లిం మ‌హిళ‌లే వ‌ద్దంటున్న ట్రిపుల్ త‌లాక్‌ ను... మోదీ రాజ‌కీయ ల‌బ్ధి కోసం వినియోగిస్తున్నార‌ని కూడా వింత వాద‌న చేశారు. వ‌చ్చే ఏడాది దేశంలోనే కీల‌క రాష్ట్రంగా భావిస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌హా ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో రాజకీయంగా ల‌బ్ధి పొందేందుకే మోదీ ట్రిపుల్ త‌లాక్ అంశాన్ని తెర‌పైకి తెచ్చార‌ని ఒవైసీ ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా త‌న వాద‌న‌ను స‌మ‌ర్ధించుకునేందుకు ఒవైసీ... త‌న పాత మాట‌ల‌నే మ‌రోమారు రిపీట్ చేశారు. ''దేశంలో 7.3 కోట్ల మంది పెళ్లి అయిన ముస్లింలు ఉన్నారు. వారంతా విడాకులు తీసుకోవ‌డం లేదు. కేవలం ఒక్క శాతం మాత్ర‌మే విడాకులు తీసుకుంటున్నారు. కానీ మోదీ త‌న మ‌న్ కీ బాత్‌ లో ట్రిపుల్ త‌లాక్ అంశాన్ని ప్ర‌స్తావించి దానిని రాజ‌కీయం చేస్తున్నారు. త‌ద్వారా ఐదు రాష్ట్రాల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో లబ్ధి పొందేందుకు ప‌న్నాగం ప‌న్నుతున్నార‌''ని ఆయ‌న ఆరోపించారు. ట్రిపుల్ త‌లాక్‌ పై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతున్న వేళ‌... సాక్షాత్తు ముస్లిం మ‌హిళ‌లే ట్రిపుల్ త‌లాక్ వ‌ద్దు బాబోయ్ అంటూ కోర్టుకెక్కుతున్న వేళ‌... అవ‌న్నీ వ‌దిలేసి మోదీని టార్గెట్ చేస్తూ ఒవైసీ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/