Begin typing your search above and press return to search.

తెలుగు మ‌హాస‌భ‌లు!...ఓవైసీ తెలుగు ప్ర‌సంగం!

By:  Tupaki Desk   |   16 Dec 2017 9:36 AM GMT
తెలుగు మ‌హాస‌భ‌లు!...ఓవైసీ తెలుగు ప్ర‌సంగం!
X
అస‌దుద్దీన్ ఓవైసీ... భాగ్య‌న‌గ‌రి హైద‌రాబాదులోని పాత‌బ‌స్తీలో మంచి ప‌ట్టున్న ఆల్ ఇండియా మ‌జ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) మ‌నమంతా షార్ట్‌గా మ‌జ్లిస్ పార్టీగా పిలుచుకునే పార్టీకి అధినేత‌. అంతేనా హైద‌రాబాదు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా ఎంపీగా గెలుస్తూ... అక్క‌డ త‌న‌కు ఎదురే లేద‌ని తేల్చి చెప్పేసిన నేత‌. ఇంతేనా... ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో గ‌న్‌మెన్లు లేకుండానే ఉగ్ర‌వాదుల సంచార‌మున్న హైద‌రాబాదులో నిర్భ‌యంగా తిరుగాడే నేత‌. ఇన్ని గొప్ప ల‌క్ష‌ణాలున్న ఓవైసీ ప్ర‌స్తావ‌న ఇప్పుడు ఎందుకంటే... ఎప్పుడు చూసినా ఉర్దూ - లేదంటే ఇంగ్లీష్‌ లోనే ప్ర‌సంగించే ఓవైసీ నోట తేట తెలుగు భాష తొణికిస‌లాడింది. ప్రస్తుతం ఎంపీగానే ఉన్నా... త‌న తండ్రి స‌లావుద్దీన్ ఓవైసీ బ‌తికున్న కాలంలో ఓవైసీ ఉమ్మ‌డి రాష్ట్ర అసెంబ్లీలో స‌భ్యుడిగానూ ఉన్నారు. ఆ స‌మ‌యంలో అసెంబ్లీలో ఆయ‌న లేచారంటే... ఆయ‌న సంధించే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక‌... అధికారంలో ఏ పార్టీ ప్ర‌భుత్వ‌మున్నా మంత్రులు తీవ్ర ఇబ్బంది ప‌డేవారు. నాన్ స్టాప్‌ గా ఉర్దూ - ఇంగ్లీష్‌ లో అన‌ర్గ‌ళంగా ప్ర‌సంగించే ఓవైసీ... ఏనాడూ తెలుగు ప‌లికిన సంద‌ర్భాలే లేవ‌నే చెప్పాలి. అస‌లు ఓవైసీ తెలుగే మాట్లాడ‌ర‌ని - తెలుగు మాట్లాడ‌టం ఓవైసీ ఫ్యామిలీ మెంబ‌ర్ల‌కు రాద‌ని కూడా ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే.

అయితే ఈ త‌ర‌హా ప్ర‌చారానికి ఓవైసీ సింగిల్ దెబ్బ‌తో చెక్ పెట్టేశారు. నిన్న హైద‌రాబాదులోని ఎల్బీ స్టేడియంలో ప్రారంభ‌మైన ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు హైద‌రాబాదు పార్ల‌మెంటు స‌భ్యుడి హోదాలో ఓవైసీ కూడా హాజ‌ర‌య్యారు. వేదిక‌పై అతి కొద్ది మందికే స్థానం ల‌భించినా... లోకల్ ఎంపీగా ఓవైసీకి కూడా వేదిక‌పై స్థానం ల‌భించింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ - భార‌త ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు - ప్ర‌ముఖ ర‌చ‌యిత నందిని సిధారెడ్డి తదిత‌రులు ప్ర‌సంగించిన త‌ర్వాత ఓవైసీకి కూడా అవ‌కాశం ల‌భించింది. ఓవైసీ లేవ‌గానే... ప్ర‌పంచ తెలుగు మహాస‌భ‌ల్లో ఉర్దూ మాట‌లు విన‌క త‌ప్ప‌దా? అని కూడా చాలా మంది సంశ‌యించారు. అయితే వారి అనుమానాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ మైకు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ఓవైసీ... అచ్చ తెలుగులో ప్ర‌సంగించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. *సభకు విచ్చేసిన ప్రముఖులకు నా హృదయపూర్వక నమస్కారములు - ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాభినందనలు' అంటూ అచ్చ తెలుగులో ప్ర‌సంగం మొద‌లెట్టిన ఓవైసీ... ఆద్యంతం తెలుగులోనే మాట్లాడారు.

త‌న ప్ర‌సంగంలో ఓవైసీ ఇంకా ఏమ‌న్నారంటే... ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌ లో నిర్వహించడం సంతోషదాయకమని - తెలుగు భాషాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారన్నారు. కుతుబ్‌ షాహీ కాలం నుంచి హిందూ - ముస్లింలు ఐకమత్యంతో జీవిస్తున్నారని, పాలు నీళ్లలా కలిసిపోయారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని కొనియాడారు. దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ రాష్ట్రంగా అభివృద్ధి చెందిందని - ఇండస్ట్రియల్ - ఐటీ - ఇతర రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధిస్తున్నదన్నారు. పాతనగరంలో నివాసం ఉంటున్న షరీఫ్ ఉర్దూలోని ఖురాన్‌ ను తెలుగులోకి అనువదించాడని, గఫూర్ అనే రచయిత తెలుగులో ఎన్నో పుస్తకాలు రచించి తెలుగు భాషకు సేవ చేశాడని ఓవైసీ తెలిపారు. దేశంలో తాను దక్షిణ భారతీయుడిని - తెలంగాణలో తెలంగాణ వాదిని - హైదరాబాద్‌ లో ఉర్దూ మాట్లాడే హైదరాబావాదీని.. ఈ ప్రపంచంమొత్తంలో మనదేశం వంటి దేశంలేదు' అంటూ ఓవైసీ త‌న‌దైన తెలుగు స్టైల్‌ తో ఆకట్టుకున్నారు. దేశంలోని అన్ని భాషలు - సంస్కృతులు వేరయినా వాటిని పరిరక్షించుకునేందుకు మనం కృషి చేయాల్సి ఉంద‌ని పిలుపునిచ్చారు. పూర్తి స్థాయిలో తొలిసారి తెలుగులో ప్రసంగించిన ఓవైసీ.. తన ప్రసంగంలో ఏవైనా పొరపాట్లు ఉంటే మన్నించాల్సిందిగా ఉర్దూలో సభకు విజ్ఞప్తి చేసి అంద‌రినీ ఆక‌ట్టుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.