Begin typing your search above and press return to search.

అసద్ మారవా? ఇప్పుడు కూడా విషం చిమ్మటమేనా?

By:  Tupaki Desk   |   7 April 2020 7:31 AM GMT
అసద్ మారవా? ఇప్పుడు కూడా విషం చిమ్మటమేనా?
X
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి కోపం వచ్చింది. తనకు అలవాటైన రీతిలో మాట్లాడిన ఆయన మాటలు ఇప్పుడు మరిన్ని ఇబ్బందులకు కారణం కానున్నాయా? అంటే అవునని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పినట్లుగా.. ఇప్పుడీ చిల్లర రాజకీయాలేంది? అన్న మాటల్ని అసద్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దేశం మొత్తం ఇప్పుడో క్లిష్టమైన సమస్యలో ఉన్నప్పుడు.. సంయమనాన్ని పాటించాల్సింది పోయి.. కొందరు అతిగాళ్ల మాదిరి వ్యవహరించాల్సిన అవసరం లేదు.

తమ్ముడు తనవాడైనా.. ధర్మం తప్పకూడదన్న సూత్రాన్ని అసద్ మర్చిపోకూడదు. దేశంలో కరోనా వ్యాప్తిలో తబ్లీగీ ఎపిసోడ్ ను ఎవరైనా ఖండించాల్సిందే. ఒకవేళ అది తబ్లీగీ జమాతే కాకుండా.. మరో హిందూ ధార్మిక సంస్థ నిర్వహించి ఉన్నా.. దాన్ని అయినా తిట్టాల్సిందే. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాల్సిందే. అలాంటిది వదిలేసి.. ఒక మతాన్ని.. సమూహాన్ని ఎవరో టార్గెట్ చేశారని వాపోవటం ఏమిటి?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో కొన్ని కల్పించినవి ఉన్నాయన్నదే అసద్ అభ్యంతరమైతే.. వాటిలోని తప్పుల్ని.. తప్పుడు ఉద్దేశాల్ని అందరికి అర్థమయ్యేలా ఫోరం ఒకటి ఏర్పాటు చేసి ప్రచారం చేయాలి. అదే సమయంలో.. తప్పులు చేస్తున్న వారు తన వాళ్లు అయినా.. వదలకూడదు. అప్పుడు మాత్రమే అసద్ కు నీతులు చెప్పే అవకాశం ఉంటుంది. ఇటీవల యూపీకి చెందిన ముస్లిం మహిళ ఒకరు..కొందరు ముస్లింలు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఒక వీడియోను తీశారు.

తన జీవితంలో ఇలాంటి వీడియో చేస్తానని అనుకోలేదని ఆమె చెప్పుకున్నారు. అందులో పలు అంశాల్ని ప్రస్తావించారు. ఒక సాధారణ మహిళ ఆ పని చేసినప్పుడు.. అసద్ లాంటి మేధావి ఎందుకు చేయకూడదు. తబ్లీగీ జమాత్ నిర్వహించిన సదస్సు మంచిది కాదన్న మాట ఆయన నోటి నుంచి ఇప్పటివరకూ ఎందుకు రాలేదు? అదొక్కటే కాదు.. సదరు సదస్సుకు వెళ్లిన వారు తమకు తాముగా ముందుకు వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలన్న పిలుపును ఎందుకు ఇవ్వనట్లు?

అలాంటివి వదిలేసి.. సోషల్ మీడియాలో ఏదో విష ప్రచారం జరుగుతుందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. ఈ సందర్భంగా తాను కూడా మాటలతో కొంత విషాన్ని చిమ్మటంలో అర్థముందా? అన్నది ప్రశ్న. ముస్లింలను టార్గెట్ చేసినట్లుగా.. వారి మీద విష ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అసద్. ఒక ముస్లింగా నన్ను ఖండించమంటారెందుకు? అని ప్రశ్నిస్తున్న ఆయన.. ఏదైనా హిందుత్వ సంస్థను అలా కోరతారా? అని అడిగే మాటల్ని విన్నప్పుడు ఆయన మరీ ఇంత అమాయకుడా? అన్న భావన కలుగక మానదు.

ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ ఒక ట్వీట్ చేస్తూ.. తబ్లీగీ జమాత్ సదస్సు బాధ్యతారాహిత్యంతో కూడున్నదన్న మాటను అసద్ చెప్పాలన్న సలహాను ఇవ్వటంపై ఫైర్ అయ్యారు. మెజార్టీలు.. మైనార్టీలు అంటూ తనకు అలవాటైన ఫ్లోలో తిట్టిపోశారు. అంతే కానీ.. తప్పు జరిగినప్పుడు అది తప్పు అని చెప్పవయ్యా పెద్ద మనిషి అంటే అసద్ కు ఎందుకంత కోపం అన్నది క్వశ్చన్. మెజార్టీలంటూ మాటలు అనేసే అసద్ మర్చిపోతున్న విషయం ఏమంటే.. దేశంలోని మైనార్టీల హక్కుల గురించి ఆ వర్గానికి చెందిన వారి కంటే.. మెజార్టీలకు చెందిన వారే పోరాడారు.. వకల్తా పుచ్చుకొని మాట్లాడారన్నది మర్చిపోకూడదు. అలాంటి విషయాల్ని వదిలేసి.. అసద్ లాంటి నాయకుడు.. తప్పును తప్పుగా ఎత్తి చూపిస్తూ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పమంటే ఎందుకంత కోపం?

సోషల్ మీడియాలో కొందరు విషం చిమ్ముతుంటారు. వారిని తప్పు పట్టాల్సిందే. అదే తీరును బాధ్యతాయుతమైన ఎంపీగా అసద్ ఎలా చేయగలుగుతారు. ఒక సీనియర్ జర్నలిస్టు చేసిన సూచనను ఇష్టముంటే ఓకే.. లేదంటే నో చెప్పేసే హక్కు అసద్ కు ఉంటుంది. అదే సమయంలో తన వాదనను వినిపించొచ్చు. అంతమాత్రాన సోషల్ మీడియా లో కొందరు అదే పనిగా నోరు పారేసుకుంటారు. అలాంటి పని అసద్ అస్సలు చేయకూడదు. అదీ కరోనా లాంటి మహమ్మారి మీద పోరాడే వేళలో.