Begin typing your search above and press return to search.

కాల్పుల సింప‌తీ.. అస‌దుద్దీన్ వ్యూహం ఏంటి?

By:  Tupaki Desk   |   8 Feb 2022 3:30 AM GMT
కాల్పుల సింప‌తీ.. అస‌దుద్దీన్ వ్యూహం ఏంటి?
X
మ‌రో రెండు రోజుల్లో అతి పెద్ద రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో తొలి విడ‌త ఎన్నిక‌లు జ‌రుగనున్నాయి. ఈ నేప‌థ్యంలో పార్టీలు ప‌దును పెంచాయి. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ కూడా.. ఇక్క‌డ ప్ర‌ష్టాత్మ‌కంగా తీసుకుంది. దాదాపు 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను నిలిపింది. ఈ క్ర‌మంలో ప్ర‌చారం కూడా పెంచింది. అయితే.. హ‌ఠాత్తుగా పార్టీ అధినేత‌, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీపై.. కాల్పుల ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌రి దీనిని ఆయ‌న ఎన్నిక‌ల్లో ఎలా వినియోగించుకుంటున్నారు.. ఈ కాల్పుల ఘ‌ట‌న సింప‌తీ ఏమేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంది? అనే చ‌ర్చ రాజ‌కీయ వర్గాల్లో జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌తిష్టాత్మ‌కంగా..

సమకాలీన దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న నేత.. మజ్లిస్ పార్టీ సారథి అసదుద్దీన్ ఒవైసీ. ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి.. బీజేపీకి సవాల్ విసరాలని ఊవిళ్లూరుతున్నారు. ఇందుకోసం ఆయన చాలా వ్యూహాల‌తోనే వెళ్తున్నారు. అధికార బీజేపీ, ప్రతిపక్ష ఎస్పీతో పాటు ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో పార్టీ నిస్సందేహంగా ఎంఐఎం. పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని చూస్తున్న అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. యూపీ ఎన్నికల్లో ప్రభావం చూపేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

ఫుల్ బిజీ..

ఎన్నికలు ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్నా ఒవైసీ మాత్రం.. ఉత్తర్ప్రదేశ్పైనే దృష్టంతా పెట్టారు. రాష్ట్రంలో బలమైన ముస్లిం ఓటు బ్యాంకు ఉండ‌డం.. దేశంలోనే జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రం కావడం.. ప్రధానంగా చిరకాల ప్రత్యర్థి బీజేపీని ఇక్కడ గద్దె దింపి.. తద్వారా 2024 ఎన్నికల్లో ఆ పార్టీని బలహీనపరచాలన్న లక్ష్యమే దీని వెనుక ఉన్న కారణంగా విశ్లేష‌కులు భావిస్తున్నారు. అందుకే ఎన్నికలు షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి పొత్తులు, ఎత్తుల వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో యూపీ- ఢిల్లీ మధ్య తీరిక లేకుండా తిరుగుతున్నారు.

66 స్థానాల్లో అభ్య‌ర్థులు..

అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటికే పొత్తులు ఖరారు చేసుకొని ముందుకెళ్తున్నారు. భారత్ ముక్తి మోర్చా అధినేత బాబు సింగ్ కుశ్వాహా నేతృత్వంతో ఐదు పార్టీలతో కలిసి 'భాగీదారీ పరివర్తన్ మోర్చా' కూటమిగా యూపీ బరిలోకి దిగుతున్నారు. 100 స్థానాల్లో పోటీ చేస్తామని గతంలోనే ప్రకటించిన ఎంఐఎం అధినేత.. ప్రస్తుతానికి 66స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే అందులో ఎక్కువ శాతం ముస్లింలే ఉన్నారు.

హిందువుల‌కూ టికెట్లు

ఎంఐఎం ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా ముద్రపడింది. అయితే ఒవైసీ గతంలో కంటే భిన్నంగా ఈసారి ముందుకెళ్తున్నారు. పోటీ చేస్తామన్న 100సీట్లలో ఇప్పటికే 66స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించారు. అయితే అందులో ఎనిమిది మంది హిందువులు కూడా ఉన్నారు. దళితులకూ సీట్లు కేటాయించారు.

ద‌ళిత సీఎం ప్రచారం..

అయితే ప్రచారంలో వినూత్నంగా ఓవైసీ ముందుకెళ్తున్నారు. యూపీ ఎన్నికల్లో కొత్తగా ఇద్దరు ముఖ్యమంత్రుల ప్రతిపాదనను ఆయన ప్ర‌చారంలో బాగా తీసుకువెళ్తున్నారు. తమ కూటమి గెలిస్తే.. ఒకరు ఓబీసీ వర్గానికి చెందిన వారు.. మరొకరు దళిత వర్గానికి చెందిన వారు సీఎం అవుతారని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. డిప్యూటీ సీఎంలను కూడా అదే స్థాయిలో వెనుకబడిన సామాజిక వర్గాలకు కేటాయిస్తామని ప్రకటించారు.

కాల్పుల ప్ర‌భావం..

ఈ నెల 3న ఉత్తర్ప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా.. ఛాజర్సీ టోల్గేట్ వద్ద ఒవైసీ కారుపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరపడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అది రాజకీయంగా చర్చకు దారి తీసింది. పార్లమెంట్లో కూడా చర్చకు వచ్చింది. దీంతో ఈ కాల్పుల అంశానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. గాంధీని చంపిన వాళ్లే తనపై దాడి చేశారంటూ ఒవైసీ తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకుంటే.. ఎంఐఎంకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆయన దాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు.