Begin typing your search above and press return to search.

ఖ‌ర్మ‌..ఖ‌ర్మ‌: రేపిస్ట్ కూడా దేవుడ‌య్యాడే..!

By:  Tupaki Desk   |   4 Aug 2015 9:01 AM GMT
ఖ‌ర్మ‌..ఖ‌ర్మ‌: రేపిస్ట్ కూడా దేవుడ‌య్యాడే..!
X
నేర‌స్తుడ్ని అభిమానించ‌టం.. ఒక భారీ నేరం చేసిన వారికి మ‌ద్ధ‌తుగా ర్యాలీలు నిర్వ‌హించ‌టం.. వంద‌లాది మంది ప్రాణాల్ని త‌న ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌తో తీసేసిన వాడిని అభిమానించ‌టం.. అత‌గాడికి అత్యున్న‌త న్యాయస్థానం విధించిన శిక్ష‌ల‌పై మాట్లాడ‌టం.. అత‌గాడికి మ‌ద్ధ‌తుగా ఊరేగింపులు చేయ‌టం లాంటివి భార‌త్ లోనే జ‌రుగుతాయేమో.

అంతేకాదు.. ఒక రేపిస్ట్ ను దేవుడిగా అభివ‌ర్ణిస్తూ పిల్ల‌లు చ‌దువుకునే పుస్త‌కాల్లో పాఠాలుగా ముద్రించ‌టం కూడా మ‌న దేశంలో మాత్ర‌మే సాధ్య‌మేమో. మాన‌భంగం కేసులో భాగంగా ప్ర‌స్తుతం జైల్లో ఉన్న వివాదాస్ప‌ద మ‌త గురువు ఆశారామ్‌బాపును దైవ స‌మానంగా పేర్కొంటూ.. శంక‌రాచార్యులు.. గురు నాన‌క్‌.. స్వామి వివేకానంద‌.. మ‌ద‌ర్ థెరిసాలాంటి వారి స‌ర‌స‌న ఆశారాం బాపూ ఫోటోను ప్ర‌చురించ‌ట‌మే కాదు.. అత‌డి గొప్ప‌త‌నాన్నికీర్తిస్తూ పాఠ్యాంశంగా చేయ‌టం వివాదాస్ప‌దంగా మారింది.

ఢిల్లీకి చెందిన ఒక ప్ర‌చుర‌ణ సంస్థ ముద్రించిన మూడో త‌ర‌గ‌తి టెక్ట్స్ పుస్త‌కంలో ఆశారాం బాపూను దైవంగా అభివ‌ర్ణించారు. ఈ వ్య‌వ‌హారం మీడియాలో రావ‌టంతో.. అధికారులు త‌ప్పంతా ముద్ర‌ణ సంస్థ‌దే బాధ్య‌త అంటే.. స‌ద‌రు ముద్ర‌ణ సంస్థ మాత్రం.. అది కేసు న‌మోదు కాక‌ముందు ముద్రించిన పుస్త‌క‌మంటూ బుకాయించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌స్తుతం మార్కెట్ లో ఉన్న పుస్త‌కాల్ని వెన‌క్కి తీసుకొని.. స‌రికొత్త‌గా ప్ర‌చురిస్తామ‌ని పేర్కొంటున్నారు. ఇంత బాధ్య‌తారాహిత్యంతో వ్య‌వ‌హ‌రించటం మ‌న‌కు మాత్ర‌మే చెల్లుతుందేమో. రేపిస్ట్ ను దైవ‌దూత‌గా.. భావి భార‌త‌పౌరులు పాఠాలు చ‌ద‌వాల్సి రావ‌టానికి మించిన ఖ‌ర్మ మ‌రొక‌టి ఉంటుందా..?