Begin typing your search above and press return to search.

షాక్.. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్టుతో ఆశ కార్యకర్త బ్రెయిన్ డెడ్?

By:  Tupaki Desk   |   24 Jan 2021 4:30 AM GMT
షాక్.. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్టుతో ఆశ కార్యకర్త బ్రెయిన్ డెడ్?
X
అక్కడెక్కడో అల్లంత దూరాన ఉన్న దేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్ లను ఇచ్చే క్రమంలో కొందరికి సైడ్ ఎఫెక్టులు ఎదురయ్యాయని.. కొందరు మరణించినట్లుగా వార్తల్లో రిపోర్టు కావటం తెలిసిందే. ఇటీవల దేశంలోనూ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం షురూ అయ్యింది. కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకున్న తర్వాత అనూహ్యంగా మరణించిన వైనం తెలంగాణలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. టీకా వేయించుకున్న మూడు రోజుల తర్వాత గుండెపోటు వచ్చిందని.. వ్యాక్సిన్ కారణంగానే అతడి మరణం చోటు చేసుకుందని వెంటనే చెప్పలేమన్న మాట అధికారుల నోట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఏపీలోని గుంటూరు జిల్లాలో తాజాగా కోవిడ్ వ్యాక్సిన్ వికటించి.. ఆశ కార్యకర్త ఒకరు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా సమాచారం. అదే సమయంలో మరో ఏఎన్ఎం అస్వస్థతకు గురైనట్లుగా చెబుతున్నారు. తాడేపల్లి పీహెచ్ సీ పరిధిలో ఈ ఘటనలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఆశ కార్యకర్త 42 ఏళ్ల విజయలక్ష్మీ.. ఆరోగ్య కార్యకర్త 38 ఏళ్ల లక్ష్మీలకు ఈ నెల 20న వ్యాక్సిన్ వేశారు.

అనంతరం లక్ష్మీకి తలనొప్పి.. ఫిట్స్ రాగా.. విజయలక్ష్మీకి తలనొప్పి.. మగత.. వాంతులు లాంటి లక్షణాలతో స్పృహ కోల్పోయింది. దీంతో.. వీరిద్దరిని జీజీహెచ్ లో చేర్పించారు. ఆందోళనతోనే లక్ష్మీకి రియాక్షన్ వచ్చిందని.. ఆ తర్వాత ఆమె సాధారణ స్థితికి చేరుకుందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఆశ కార్యకర్త విజయలక్ష్మి మాత్రం బ్రెయిన్ స్టెమ్ స్ట్రోక్ గురైనట్లుగా తేల్చారు. శనివారం రాత్రికి ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లుగా సమాచారం.

అయితే.. ఈ సమాచారాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. విజయలక్ష్మీకి టీకా వేసిన వెయిల్ లోనే.. మరో వైద్యుడికి టీకా వేశారు. అతడి పరిస్థితి మామూలుగా ఉండటం.. ఎలాంటి రియాక్షన్ లేకపోవటం గమనార్హం. దీంతో.. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలే ఆమె మరణానికి కారణమా? అన్నది ప్రశ్నగా మారింది. ఆశ కార్యకర్త మరణంపై వైద్యులు సమగ్ర విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని బయటకు రావాల్సి ఉంది.