Begin typing your search above and press return to search.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అలా చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   24 May 2015 10:30 AM GMT
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అలా చేస్తున్నారా?
X
తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కారణం మూడు ముక్కల్లో చెప్పమంటే.. నీళ్లు.. నిధులు.. నియమకాలు అని ఇట్టే చెప్పేస్తారు. విభజన తర్వాత కూడా ఈ మూడు అంశాలపై వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నీళ్లు.. నిధుల విషయంలో ఇప్పటికే రచ్చ.. రచ్చ అవుతుంటే.. నియమకాలకు సంబంధించి రెండు రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించి ఆసక్తికరమైన వాదనలు వినిపిస్తున్నాయి.

ఏపీక్యాడర్‌ ఉద్యోగులు తెలంగాణ క్యాడర్‌లో తిష్ట వేసుకొని కూర్చున్నారని.. వారి కారణంగా తమ అవకాశాలన్నీ పోతున్నాయంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు వ్యాఖ్యానిస్తుంటే.. సరిగ్గా ఇలాంటి వాదననే ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు అశోక్‌బాబు చేస్తున్నారు. తాను చేస్తున్న ఆరోపణలకు ఆయన తగిన వాదనను వినిపిస్తున్నారు.

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగ విరమణ వయసు అరవైళ్లు కావటం.. తెలంగాణలో ఇది 58 మాత్రమే కావటంతో.. తెలంగాణ క్యాడర్‌కు చెందిన చాలామంది ఉద్యోగులు ఏపీ క్యాడర్‌లో ఉండిపోవటానికి మక్కువ చూపుతున్నారంటున్నారు. దీనికి సంబంధించి.. ఏపీ ఉద్యోగులకు మాత్రమే 60 ఏళ్ల అవకాశం ఇవ్వాలని.. ఏపీ క్యాడర్‌ ఉద్యోగుల్లోని తెలంగాణవారికి అలాంటి అవకాశం ఇవ్వాలని వాదిస్తున్నారు.

చాలామంది తెలంగాణ ఉద్యోగులు ఏపీ క్యాడర్‌ కోరుకుంటున్నారని.. ఇది విభజన స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానిస్తున్నారు. మరి.. ఈ అంశంపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు స్పందిస్తే బాగుంటుందేమో. టీ ఉద్యోగుల మీద అశోక్‌బాబు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆధారాల్ని బయట పెడితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.