Begin typing your search above and press return to search.

అశోక్‌ బాబుపై ఉద్యోగుల ఫైరింగ్

By:  Tupaki Desk   |   8 Jan 2017 4:35 AM GMT
అశోక్‌ బాబుపై ఉద్యోగుల ఫైరింగ్
X
సమైక్యాంధ్ర ఉద్యమంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులను దాదాపు 90 రోజులపాటు సమ్మెబాట పట్టించడమే గాక ఆ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించిన ఆంధ్ర‌ప్రదేశ్ ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ అశోక్‌ బాబుపై తిరుగుబాటు ప్రారంభమైంది. ఉద్య‌మం ముగిసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు అశోక్‌ బాబు ఎంతో దగ్గరయ్యారు. అనుకోని రీతిలో సమ్మె కాలానికి జీతాలు చెల్లింపు, కొత్త పీఆర్‌ సీ - పదవీ విరమణ వయస్సు పెంపు వంటివి చోటుచేసుకోవటంతో అశోక్‌బాబు ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఇదే సమయంలో తోటి ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారనే భావనతో క్రమేణా ఉద్యోగుల్లో ఆయనపట్ల వ్యతిరేకత ప్రబలుతూ వచ్చింది. ముఖ్యంగా పదవీ విరమణ వయసు పెంపుతో ఆయన మరోసారి ఎన్‌ జీవో సంఘం అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి మార్గం సుగమమైంది. వచ్చే నెలలో విజయవాడలో జరిగే ఎన్‌జివో సంఘం మహాసభలో అశోక్‌ బాబు రెండోసారి అధ్యక్షునిగా ఎన్నిక కాబోతున్నారు. సాంప్రదాయంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎన్‌జివో సంఘం అధ్యక్షులే ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జేఏసీ చైర్మన్ పదవి నుంచి ఆయనను పక్కకు నెట్టివేసే ప్రయత్నాలు కొద్దిరోజులుగా తెరవెనుక ఊపందుకుంటున్నాయి.

రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు దాదాపు 90కి పైగానే ఉండగా ఉద్యోగులకు సంబంధించి విధి విధానాల ఖరారు కోసం ఏర్పాటైన జాయింట్ స్టాఫ్‌ కౌన్సిల్‌లో తొమ్మిది ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భాగస్వాములుగా ఉన్నారు. ఇందులో ఎన్‌జివో సంఘం, రెవెన్యూ సంఘం, క్లాస్-4, డ్రైవర్స్, నాలుగు ఉపాధ్యాయ సంఘాలు, సచివాలయ ఉద్యోగుల సంఘం ఉన్నాయి. తాజాగా రెవెన్యూ, క్లాస్-4, డ్రైవర్స్ సంఘాలు అశోక్‌బాబు నాయకత్వాన్ని బాహాటంగానే వ్యతిరేకిస్తున్నాయని చెప్పటానికి ఆయన అధ్యక్షతన ఎన్‌జివో సంఘంలో జరిగిన రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం ప్రబల నిదర్శనంగా పేర్కొనవచ్చు. అశోక్‌బాబును వ్యతిరేకిస్తున్న పై మూడు సంఘాల ప్రతినిధులతోపాటు కోఆపరేటివ్ - ట్రెజరీ - గెజిటెడ్ ఆఫీసర్స్ - మున్సిపల్ ఎంప్లారుూస్ - మహిళా - శిశు సంక్షేమ సంఘం - వివిధ ఇంజనీరింగ్ శాఖల విభాగాల్లో పనచేసే వర్క్‌ చార్జ్‌ డ్ అసోసియేషన్ - మెడికల్ హెల్త్ - ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్స్ - విఆర్‌వో అసోసియేషన్ - విఆర్‌ ఎ అసోసియేషన్ సంఘాల ప్రతినిధులు ఓ పక్క వ్యూహరచనతో నేటి సమావేశాన్ని బహిష్కరించడంతో జేఏసీలో చీలిక అనివార్యంగా కన్పిస్తోంది. అయితే అశోక్‌ బాబుకు మొదటినుంచి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన పశ్చిమ కృష్ణా సంఘ అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ స్వయంగా గత మూడురోజులుగా రెవెన్యూ - ఇతర సంఘాల నేతలతో నడిపిన రాయబారాలు ఫలించలేదు.

సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద‌ సమస్యల పరిష్కారంలో అశోక్ బాబు రాజీపడుతున్నారని కొందరు విమర్శిస్తున్నారు. ఎన్‌జివో సంఘం కేవలం నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తుంటే ఒక్క రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మాత్రమే అటెండర్ నుంచి గెజిటెడ్ హోదా కల్గిన తహశీల్దార్ కేడర్ వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. పబ్బరాజు నాయకత్వంలో రెవెన్యూ ఉద్యోగ సంఘ నేతలు సిఎంతో పోరాడి ఎంతోకాలంగా పెండింగ్‌లోనున్న వందలాది పోస్టుల భర్తీకి, అలాగే ప్రతి తహశీల్దార్‌కు కొత్త వాహనాన్ని మంజూరు చేయించిన విషయాన్ని ఇతర సంఘాల నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని అయినా జేఏసీ చైర్మన్ పట్టించుకోవటం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే అశోక్‌బాబుకు వ్య‌తిరేకంగా చీలిక ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/