Begin typing your search above and press return to search.

మోడీ కంటే ఇద్దరు తెలుగు ఎంపీలు బెటరంట

By:  Tupaki Desk   |   25 Aug 2016 10:12 AM GMT
మోడీ కంటే ఇద్దరు తెలుగు ఎంపీలు బెటరంట
X
ఏదైనా పథకాన్ని కేంద్రం ప్రారంభించిన తర్వాత..దాని అమలు విషయంలో మదింపు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? మిగిలిన ఎంపీల మాదిరే ఒక ఎంపీగా ప్రధాని పని తీరు మాటేమిటి? లాంటి ప్రశ్నలకు తాజాగా ఒక సమాధానం లభించింది. ఆదర్శ గ్రామాల పథకం కింద ఎంపీలు ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామ స్వరూపాన్ని మార్చే పథకం గురించి తెలిసిందే. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలోనడిచే ఈ కార్యక్రమం అమలు ఎలా జరుగుతుందన్న విషయాన్ని సదరు కేంద్రమంత్రిత్వ శాఖ తాజాగా మదింపు చేపట్టింది.

దాదాపు 35 అంశాల్ని ప్రాతిపదికగా తీసుకొని టాప్ 15 గ్రామాల్ని ఎంపిక చేసింది. ఏ ఎంపీ తాను తీసుకున్న దత్తత గ్రామాల మీద ఎక్కువ దృష్టి సారించారు? వారు అక్కడ తీసుకొచ్చిన మార్పులు ఏంటి? అన్న విషయాల్ని మదింపు చేశారు. దాదాపు 35 అంశాల్ని ప్రాతిపదికగా తీసుకొని ఎవరు తమ దత్తత గ్రామాల్ని మార్చారన్న అంశంపై చేసిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

మొత్తం 702 మంది ఎంపీలు ఎవరికి వారు తాము ఎంపిక చేసిన గ్రామాల్ని కేంద్రమంత్రిత్వ శాఖ పరిశీలించింది. అక్కడి పరిస్థితుల్ని సమీక్షించింది. గ్రామ దత్తత కార్యక్రమంలో టాప్ 15 మంది ఎంపీల్ని ఎంపిక చేయగా ఆ జాబితాలో ప్రధాని మోడీ పేరు లేకపోవటం గమనార్హం. అదే సమయంలో టాప్ 15లో ఇద్దరు తెలుగు ఎంపీలు ఉండటం విశేషం. టాప్ 15 జాబితాలో చోటు సాధించిన తెలుగు ఎంపీలు చూస్తే.. వారిలో ఒకరు కేంద్రమంత్రి.. ఏపీకి చెందిన అశోక గజపతి రాజు కాగా.. మరొకరు తెలంగాణ ప్రాంతానికి చెందిన అధికార టీఆర్ ఎస్ కు చెందిన వినోద్ కుమార్. వీరిద్దరూ దత్తత తీసుకున్న గామాల్లో మార్పులు చోటు చేసుకున్నట్లుగా తేల్చారు.

మిగిలిన ఎంపీల మాదిరే ప్రధాని మోడీ సైతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అయితే.. టాప్ 15 జాబితాలో మోడీ దత్తత గ్రామం లేదు. ఇక.. టాప్ 15 జాబితాలో ఎంపికైన ఎంపీలను పార్టీల వారీగా చూస్తే.. ఆరుగురు మాత్రమే బీజేపీకి చెందిన వారు కాగా.. మిగిలిన తొమ్మిది మంది బీజేపీయేతర పార్టీలకు చెందిన ఎంపీలు ఉండటం విశేషం.