Begin typing your search above and press return to search.

రాజుగారు హోదా మాత్రం అడగట్లే!

By:  Tupaki Desk   |   15 May 2018 12:40 AM GMT
రాజుగారు హోదా మాత్రం అడగట్లే!
X
బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ కేంద్రంతో విభేదించిన తర్వాత... విభజన చట్టాన్ని వెంటనే అమలు చేయాలనే డిమాండ్ తో కొన్నాళ్లు ప్రహసనం నడిపించి తర్వాత కాడి పక్కన పారేసిన నేపథ్యంలో.. అప్పట్లో రాజీనామా చేసిన తెదేపా కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ఇన్నాళ్లూ ఏమైపోయారు? అనే సందేహం పలువురికి కలగడం సహజం. పైగా ప్రత్యేకహోదా సాధించడానికి పోరాడుతున్నాం అంటూ ఆ మధ్య పార్టీ నిర్వహించిన కొన్ని భారీ కార్యక్రమాలకు కూడా రాజుగారు మొహం చాటేశారు. తిరుపతిలో వంచన సభకు కూడా ఆయన రాలేదు. అలాంటి అశోక్ గజపతి రాజు.. తాజాగా విజయనగరం జిల్లా మహానాడులో మాత్రం మెరిశారు. రాజకీయాలు చాలా గమ్మత్తుగా మారాయని, అవినీతి పరుడే ప్రజల్ని ఉద్ధరిస్తానంటున్నాడని జగన్ ను కూడా విమర్శించారు.

అయితే రాజీనామా తర్వాత ఇంత సుదీర్ఘ కాలం ఆయన పార్టీ వేదికల మీద కనిపించకపోవడం... ప్రత్యేకహోదా గురించి, పార్టీ ఈ మధ్య కాలంలో ఆయన ఎన్నడూ పెదవి విప్పకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. విజయనగరం పార్టీ మినీ మహానాడులో కూడా ఆయన హోదా గురించి, కేంద్రం చేసిన వంచన గురించి పెద్దగా ప్రస్తావించకపోవడం ఇలాంటి అనుమానాలకు తావిస్తోంది. నీతిఆయోగ్ పరిశీలించిన 42 అంశాల్లో అత్యుత్తమంగా నిలిచిన విజయనగరం నియోజకవర్గానికి, ప్రకటించిన మాట ప్రకారం మోడీ పర్యటనకు వస్తారా? లేదా? అని మాత్రమే అశోక్ గజపతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతే తప్ప.. హోదానుకేంద్రం ఏం చేసింది? అని అడగడం లేదు.

తమాషా ఏంటంటే.. తెలుగుదేశం రాజకీయాల్లో ఎంతో సీనియర్ అయిన అశోక్ గజపతి రాజు భాజపాలోకి మారవచ్చుననే ప్రచారం ఇటీవలి కాలంలో ముమ్మరంగా జరిగింది. ఆయన అనుసరించే మెతక వైఖరి... పైగా కేంద్రమంత్రి అయిన తర్వాత.. ఢిల్లీ భాజపా నాయకులతో పెరిగిన సాన్నిహిత్యం.. వీటన్నింటికీ తోడు భాజపా ముఖ్యమంత్రి వసుంధర రాజెతో ఆయన కుటుంబానికి ఉండే బాంధవ్యం.. ఇత్యాది అంశాల దృష్ట్యా ఆయన తెదేపా రాజకీయాలనుంచి కమలదళం వైపు మళ్లుతారనే ప్రచారం ఉంది. ఆయన ఇప్పటికీ.. హోదా మాటెత్తకుండా పసలేని ఇతర అంశాలను ప్రస్తావిస్తున్నారంటేనే.. దీని వెనుక ఏదో మతలబు ఉందని పలువురు అనుకుంటున్నారు.