Begin typing your search above and press return to search.

రాజుగారికి ఎంత కోపం వ‌చ్చేసిందంటే...

By:  Tupaki Desk   |   27 Nov 2016 10:09 AM GMT
రాజుగారికి ఎంత కోపం వ‌చ్చేసిందంటే...
X
రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు దూరంగా ఉండే టీడీపీ ఎంపీ - కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు త‌న స‌హ‌జ శైలికి భిన్నంగా ఘాటు విమ‌ర్శ‌లు గుప్పించారు. విజయనగరంలో బడి రుణం తీర్చుకుందాం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి మృణాళినితో కలిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అశోక్ గ‌జ‌ప‌తిరాజు మాట్లాడుతూ ప్రజలందరి ప్రోత్సాహంతో వారిచ్చిన గౌరవాన్ని నిలబెట్టేందుకు పని చేస్తున్నానని తెలిపారు. తనను గతంలో ఎన్నిక‌ల్లో ఓడించినప్పటికీ కార్యకర్తగానే పని చేశానన్నారు. ఇతర పార్టీల నాయకుల్లా తాను ఓడిపోయినా కప్పగంతులు వేయలేదని అశోక్ గ‌జ‌ప‌తి రాజు అన్నారు.

ప్ర‌తిప‌క్ష‌ వైసీపీ నేతలు పదేపదే అభివృద్ది గురించి మాట్లాడుతూన్నారని, అభివృద్ది అంటే ప్రజల సొమ్ముతో విలాసవంతమైన భవనాలు నిర్మించడమా అని నిల‌దీశారు. బెంగుళూరులో వైసీపీ అధినేత‌ జగన్‌,హైదరాబాద్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ విలాసమైన భవనాలు నిర్మించుకోవడం అభివృద్ది అంటారా అశోక్ గ‌జ‌ప‌తిరాజు ప్ర‌శ్నించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్దికి తోడ్పాటునందించాలని ఆయ‌న కోరారు. తల్లి,పిల్ల కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న నాయకులు రాష్ట్రాన్ని విభజించడంతో పాటు, రాష్ట్రాన్ని దోచుకు తిన్నారన్నారు. నల్లధనం వెలికితీయడానికి పెద్ద నోట్లు రద్దు చేస్తే తల్లి - పిల్ల కాంగ్రెస్‌ నాయకులు బెంబెలెత్తిపోతున్నారని అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఎద్దేవా చేశారు. చేసిన తప్పులు పక్కన పెట్టి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోండని చెబితే కేవలం కొద్దిమాత్రమే ముందుకు వచ్చారని, మిగతా వారికి ఏమి చేయాలో దిక్కుతోచడం లేదని అన్నారు. పేదలు, సామాన్యుల ఉజ్వల భవిష్యత్‌ కోసమే పెద్ద నోట్లను కేంద్రప్రభుత్వం రద్దు చేసిందని అశోక్‌ గజపతిరాజు అన్నారు. నోట్ల రద్దు వల్ల కొన్ని ఇబ్బందులు వాస్తవమేనని, రానున్న కాలంలో ఉజ్వల భవిష్యత్‌ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి కిమిడి మృణాళిని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మ‌న బడిని మనమే బాగు చేసుకుందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. మనం చదువుకున్న పాఠశాలకు మన వంతుగా కొత్త అదనపు తరగతిగదులు నిర్మించేందుకు, పుస్తకాలు పంపిణీ, నాణ్యమైన విద్య అందేలా తోడ్పడటం, పిల్లలకు ఆర్థిక సహకారం చేయడం వంటి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు రావాలని ఈ సందర్బంగా మృణాళిని కోరారు. ఇప్పటికే జిల్లాలో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు అనేక పాఠశాలలకు బెంచీలను అందజేశారన్నారు. ప్రతి ఒక్కరం మనం చదువుకునే పాఠశాలకు సహకరిద్దామని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆర్థికఇబ్బందులున్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామన్నారు. రానున్న కాలంలో రేషన్‌ కార్డులు, గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తామని మృణాళిని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/