Begin typing your search above and press return to search.

అశోక్ గ‌జ‌ప‌తిని అడ్డంగా బుక్ చేసిన జేసీ

By:  Tupaki Desk   |   30 Jun 2017 5:36 PM GMT
అశోక్ గ‌జ‌ప‌తిని అడ్డంగా బుక్ చేసిన జేసీ
X
కొన్ని విష‌యాలు తెర మీద‌కు వ‌చ్చి.. కాసింత హ‌డావుడి చేసి వెళ్లిపోతుంటాయి. మ‌రికొన్ని అంశాలు మాత్రం నాన్ స్టాప్ గా హ‌డావుడి చేస్తూనే ఉంటాయి. పుల్‌స్టాప్ ప‌డ‌కుండా.. కామాతో కొన‌సాగుతుంటాయి. తాజాగా చెప్పే ఉదంతం ఈ రెండింటికి భిన్న‌మైన‌ది. ఒక‌రి త‌ప్పు మ‌రొక‌రి ప‌ద‌వికే ముప్పు తెచ్చేలా మారిన వైనంగా చెప్పొచ్చు.

ఆ మ‌ధ్య‌న విశాఖ‌ప‌ట్నం ఎయిర్ పోర్ట్ లో ఏపీ అధికార‌ప‌క్ష ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ర‌చ్చ ర‌చ్చ చేయ‌టం.. ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిపై శివాలెత్త‌టం.. ఆగ్ర‌హంతో ప్రింట‌ర్‌ను విసిరి కొట్ట‌టం తెలిసిందే. ఆల‌స్యంగా వ‌చ్చిన ఆయ‌న‌కు బోర్డింగ్ పాస్ లు ఇచ్చే టైమ్ అయిపోయింద‌ని చెప్పినందుకు ఆయ‌న చేసిన ర‌చ్చ ప్రాంతీయంగానే కాదు.. జాతీయ మీడియాలోనూ భారీగా ఫోక‌స్ అయ్యింది.

ఈ ఉదంతం జ‌రిగిన వెంట‌నే విదేశాల‌కు వెళ్లిపోయిన జేసీ కార‌ణంగా.. ఈ ఇష్యూ అక్క‌డితో క్లోజ్ అయ్యింది. ఇండిగో సిబ్బంది ప‌ట్ల తాను చేసిన ప‌నికి సారీ చెప్పేది లేదంటూ భీష్మించుకున్న జేసీ తీరు విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌గా.. జ‌రిగిన ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లుగా జేసీ ప్రాతినిధ్యం వ‌హించే పార్టీకే చెందిన కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు వెల్ల‌డించారు.

జేసీ.. విదేశాల‌కు వెళ్లిపోవ‌టం.. జ‌రిగిన ఘ‌ట‌న‌పై కేంద్ర‌మంత్రి విచార‌ణ‌కుఆదేశించ‌టంతో ఇష్యూ క్లోజ్ అయిన‌ట్లుగా మీడియా భావించి.. అక్క‌డితో వ‌దిలేసింది. అయితే.. ఆర్నాబ్ గోస్వామికి చెందిన రిప‌బ్లిక్ ఛాన‌ల్ మాత్రం ఈ ఇష్యూను అక్క‌డితో వ‌దిలి పెట్ట‌లేదు. జేసీపై స్టింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించి.. ఆయ‌న నోటి నుంచే జ‌రిగింది చెప్పించ‌ట‌మే కాదు.. ఈ ఉదంతంలోకి కేంద్ర‌మంత్రిని లాగి.. ఆయ‌న ప‌ద‌వి కింద‌కు నీళ్లు తెచ్చేలా చేశార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో సిబ్బందిపై జేసీ జులుం చేసిన స‌మ‌యంలో.. కేంద్ర విమానాయాన శాఖా మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు కూడా అక్క‌డే ఉన్నార‌ని.. ఆయ‌నే జేసీకి బోర్డింగ్ పాస్ ఇప్పించి పంపార‌న్న విష‌యం వెల్ల‌డి కావ‌టం సంచ‌ల‌నంగా మారింది.

స్టింగ్ ఆప‌రేష‌న్ లో జేసీ నోటి నుంచి వ‌చ్చిన విష‌యాలు సంచ‌ల‌నంగా మారాయి. అశోక్ గ‌జ‌ప‌తిరాజును ఉద్దేశించి.. "ఆయ‌న స్టేష‌న్ మేనేజ‌ర్‌ను పిలిచారు. రెడ్డి ఏది అడుతున్నారో అది ఇవ్వండి" అని చెప్పారన్న విష‌యాన్ని జేసీ చెప్పేశారు. అంతేకాదు.. ఏ విమానానికి తాను బోర్డింగ్ పాస్ ఇవ్వాల‌ని కోరానో.. అదే విమానంలోనే తాను విశాఖ‌ప‌ట్నం నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన విష‌యాన్ని కూడా జేసీ వెల్ల‌డించారు.

స్టింగ్ ఆప‌రేష‌న్ లో జేసీ చెప్పిన మాట‌ల‌తో కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఇర‌కాటంలో ప‌డిన‌ట్లుగా భావిస్తున్నారు. ఇండిగో సిబ్బందిపై తాను ఘ‌ర్ష‌ణ‌కు దిగిన విష‌యాన్ని జేసీ ఒప్పుకుంటూ.. "నేను హ‌డావుడిలో ఉన్నాను. రెండు.. మూడుసార్లు బ్ర‌తిమిలాడినా టిక్కెట్టు ఇవ్వ‌క‌పోవ‌టంతో ఎమోష‌న‌ల్ అయ్యా. అక్క‌డున్న ప్రింట‌ర్‌ను ప‌క్క‌కు తోసేయాల‌నుకున్నా. కానీ నా వ‌ల్ల కాలేదు. నేనెవ‌రికీ సారీ చెప్ప‌ను. అస‌లు ఎందుకు సారీ చెప్పాలి?నేనూ మ‌నిషినే.. ప్ర‌యాణ హ‌డావుడిలోనే ఇది జ‌రిగింది" అని జేసీ చెప్పిన మాట‌ల్ని రిప‌బ్లిక్ టీవీ ఛాన‌ల్ ప్ర‌సారం చేసింది. ఈ ఛాన‌ల్ ప్ర‌సారం చేసిన క‌థ‌నంలో ఇండిగో ఎయిర్ లైన్స్ మేనేజ‌ర్‌ను వెనుక నుంచి జేసీ నెట్టివేసిన దృశ్యం ఉంది.. అయితే.. తాను అధికారిపై స్నేహ‌పూర్వ‌కంగానే చేతులు వేసిన‌ట్లుగా జేసీ చెప్పుకున్నారు. తాజా స్టింగ్ ఆప‌రేష‌న్ నాటి (జూన్ 15న) ఉదంతం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చిన‌ట్లైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/