Begin typing your search above and press return to search.

మాన్సాస్ ట్ర‌స్ట్ వివాదం.. హైకోర్టు కీల‌క ఆదేశాలు

By:  Tupaki Desk   |   27 July 2021 9:39 AM GMT
మాన్సాస్ ట్ర‌స్ట్ వివాదం.. హైకోర్టు కీల‌క ఆదేశాలు
X
ఏపీలోని మాన్సాస్ ట్ర‌స్ట్ వివాదంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. మాన్సాస్‌ ట్ర‌స్టు చైర్మ‌న్ గా ఉన్న అశోక గ‌జ‌ప‌తి రాజు ఆదేశాల‌ను ట్ర‌స్టు ఈవో పాటించాల్సిందేన‌న న్యాయ‌స్థానం తేల్చి చెప్పింది. చైర్మ‌న్ ఆదేశాల‌ను ప‌క్క‌న పెట్ట‌డానికి వీళ్లేద‌ని ప్ర‌శ్నించింది. కొంత కాలంగా.. ఈవో-చైర్మ‌న్ మ‌ధ్య విభేదాలు తార‌స్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ట్ర‌స్టు చైర్మ‌న్ అశోక గ‌జ‌ప‌తి న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు.

ఈ మేర‌కు గ‌త వారం హైకోర్టులో పిటిష‌న్‌ దాఖ‌లు చేశారు అశోక గ‌జ‌ప‌తి రాజు. ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ తన ఆదేశాల‌ను పాటించ‌డం లేద‌ని పిటిష‌న్ లో పేర్కొన్నారు. ఈ పిటిష‌న్ ను మంగ‌ళ‌వారం విచారించిన న్యాయ‌స్థానం కీల‌క ఆదేశాలు జారీచేసింది. ఈవో తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేసింది. మాన్సాస్ లో ఆడిట్ పేరుతో ఇత‌రులు జోక్యం చేసుకోవ‌డానికి వీళ్లేద‌ని స్ప‌ష్టం చేసింది. కేవ‌లం జిల్లా ఆడిట్ అధికారి మాత్ర‌మే ఆడిట్ చేయాలని ఆదేశించింది. చైర్మ‌న్ అధికారాల‌ను ఎవ‌రూ అడ్డుకోలేర‌ని తేల్చి చెప్పింది. ఆయ‌న ఆదేశాల‌ను ఖ‌చ్చితంగా పాటించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది న్యాయ‌స్థానం.

కాగా.. గ‌తేడాది నుంచి ఈ మాన్సాస్ ట్ర‌స్టు పంచాయితీ న‌లుగుతున్న సంగ‌తి తెలిసిందే. ట్ర‌స్టు చైర్మన్ ను మారుస్తూ.. రాష్ట్ర స‌ర్కారు నిర్ణ‌యం తీసుకోవ‌డంతో వివాదం మొద‌లైంది. ఆ త‌ర్వాత ఈవో వ‌ర్సెస్ చైర్మ‌న్ అన్న విధంగా వివాదం మ‌లుపు తిరిగింది. ఈ పంచాయితీ ముద‌ర‌డంతో.. కొంద‌రు అధికారులు స‌హ‌క‌రించ‌ట్లేద‌ని చైర్మ‌న్ అశోక గ‌జ‌ప‌తి చెబుతూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. దీంతో.. న్యాయ‌స్థానం చైర్మ‌న్ కు అనుకూలంగా తీర్పు చెప్పింది. మ‌రి, వివాదం ఇంత‌టితో స‌ద్దుమ‌ణుగుతుందా? మ‌ళ్లీ ఏదో రూపంలో మొల‌కెత్తుతుందా? అన్న‌ది చూడాలి.