Begin typing your search above and press return to search.

ఆ ఒక్క క్షణం ఎప్పుడండీ రాజు గారూ!

By:  Tupaki Desk   |   2 March 2018 5:04 PM GMT
ఆ ఒక్క క్షణం ఎప్పుడండీ రాజు గారూ!
X
మొత్తానికి తెలుగుదేశం పార్టీ కేంద్రమంత్రులు మోడీ సర్కారునుంచి రాజీనామాలు చేసి బయటకు రావడానికి ముహూర్తం కుదిరినట్టే.. ఒక్క క్షణంలో రాజీనామా లేఖలను కేంద్రం మొహాన పారేసి ఇంటికి వచ్చేస్తాం.. అని ప్రస్తుతం విమానాల మంత్రి పదవిలో ఉన్న మన రాజుగారు చాలా ఘంటాపథంగా సెలవిచ్చారు. తమకు పదవులు లెక్క కాదు.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని సెలవిచ్చారు.

మంత్రుల రాజీనామాలే జరిగితే గనుక.. మోడీ సర్కారు కూసాలు కదులుతాయని.. పరువు గంగలో కలుస్తుందని.. వారిలో కదలిక వస్తుందని సొంత విశ్లేషణలతో కలలు కంటున్న వెర్రిజనం ఎవరైనా ఉంటే.. ఒక్క క్షణం ఆగండి. రాజుగారు ఒక్క క్షణంలో రాజీనామాలు చేసేయగలం అని మాత్రమే చెప్పారు. ఎప్పుడనేది ఇంకా నర్మగర్భంగానే ఉంది. మళ్లీ ఎవరూ ఆ ప్రశ్న సంధించకుండా.. చంద్రబాబు గారు ఆదేశించినప్పుడు అని రాజుగారు సెలవిస్తున్నారు.

అనగా.. చంద్రబాబు గారు ఆదేశించిన వెంటనే.. రాజుగారు, మరో మంత్రి సుజనాతో కూడా కలిసి (ఆయన ఇంత తేలిగ్గా ఒప్పుకుంటారో లేదో మరి) రాజీనామాలు చేసేస్తారనే వాదన వినడానికి బాగానే ఉంది. మరి చంద్రబాబు గారికి ఆ రేంజిలో కోపం ఎప్పటికి రావాలి? సంయమనం సంయమనం అంటూ తన అవకాశ వాద పోకడలకు చక్కటి ముసుగు వేసుకుని.. కేంద్రం ఎదుట సాగిలపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. రాజీనామాలను పురమాయించేంత ఆగ్రహానికి చేరుకునే లోగా.. ఏడాది గడచిపోయి సార్వత్రిక ఎన్నికలే వస్తాయని ప్రజలు జోకులేసుకుంటున్నారు.

ట్విస్టు ఏంటంటే..

తాము ఢిల్లీలో ఉండగా.. చంద్రబాబునాయుడు గనుక ఫోను చేసి రాజీనామాలను ఆదేశిస్తే.. తక్షణం రాజీనామా చేసేసి.. ఆ లేఖలను ప్రధానికి గాని - రాష్ట్రపతికి గాని - స్పీకరుకు గాని ఇచ్చేసి వచ్చేస్తాం అని అశోక్ గజపతి రాజుగారు అంటున్నారు. అయినా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు ఆ లేఖను ఎవరికి ఇవ్వాలో తెలియకుండానే.. ఆయన ఇంత సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారా అని కూడా జనానికి నవ్వు వస్తోంది. మినిమం ప్రోటోకాల్ పరిజ్ఞానం కూడా తెలియనట్టుగా.. ఏదో సభారంజకంగా ఉండడానికి అన్నట్లుగా రాజుగారి లాంటి సీనియర్లు కూడా మాటలు పేలితే ఎలా అని జనం నవ్వుకుంటున్నారు.