Begin typing your search above and press return to search.

ఎయిరిండియా ఎందుకూ పనికిరాదట..

By:  Tupaki Desk   |   10 Jun 2016 6:24 AM GMT
ఎయిరిండియా ఎందుకూ పనికిరాదట..
X
ఎయిరిండియా... పౌర విమానయాన రంగంలో ప్రభుత్వానికి ఉన్న ప్రధాన సంస్థ ఇది. అలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ పనితీరుపై సాక్షాత్తు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రే పెదవివిరిచేశారు. పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు ఎయిర్ ఇండియా విషయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇతర విమానయాన సంస్థలతో పోలిస్తే ఎయిర్ ఇండియా బుకింగ్సు చాలా డల్ గా ఉన్నాయని... ఇప్పటికిప్పుడు ఎయిరిండియాను అమ్మకానికి పెట్టినా ఎవరూ కొనరని ఆయన అనేశారు. ఎయిరిండియా 50 వేల కోట్ల రూపాయల నష్టాల్లో మునిగి ఉందని చెప్పిన ఆయన దాన్ని కొనుగోలు చేసేందుకు కూడా ఎవరూ రాకపోవచ్చన్న కఠిన సత్యాన్ని తన నోటితోనే చెప్పడం అందరినీ ఆశ్యర్యపరిచింది. అయితే ఎయిర్ ఇండియాలోని పెట్టుబడులు ఉపసంహరించే ఆలోచన మాత్రం కేంద్రానికి లేదని కాస్త ఊరట కలిగించే విషయం చెప్పారు.

విమానయాన రంగంలో తీవ్ర పోటీ ఉన్న తరుణంలో కేంద్ర మంత్రి అలా ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ ఇండియా గురించి వ్యాఖ్యలు చేయడంపట్ల అంతటా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రయివేటు సంస్థలకు పోటీ ఇవ్వలేదని అంటున్నప్పుడు సాక్షాత్తు ఆ శాఖ మంత్రే అలా మాట్లాడితే ప్రజలు ఇంకా దానిపై నమ్మకం కోల్పోయే ప్రమాదముంది. మంత్రి వ్యాఖ్యలు కచ్చితంగా ఎయిరిండియాకు మరింత నష్టం కలిగిస్తాయి. బహుశా ఆ విషయం వెంటనే గుర్తించారో ఏమో కానీ.. అశోక్ అంతలోనే కాస్త సర్దుకున్నారు. ఎయిరిండియా మంచి సంస్థ అని పొగడ్తలు ప్రారంభించారు. యూపీఏ ప్రభుత్వంతా తాము ఎయిరిండియాను నట్టేట్లో వదిలేయబోమని భరోసా ఇచ్చారు. ఎయిరిండియా నష్టాల నుంచి గట్టెక్కేలా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

మొత్తానికి అశోక్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా విమానయాన వర్గాలు, ప్రభుత్వ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి ప్రయివేటు పోటీని ఎలా ఎదుర్కోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్న సంస్థను గాడినపెట్టాల్సిన పరిస్థితుల్లో మంత్రి తీసిపారేసేలా మాట్లాడడం తగదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. అశోక్ మాటల్లో నిజాన్ని మాత్రం కాదనలేమని ఎయిర్ ఇండియా వర్గాలు కూడా అంటున్నాయి. ఆయన వాస్తవ పరిస్థుతులనే చెప్పారని... సంస్థను గట్టెక్కిస్తే మంచిదనిఅంటున్నారు.