Begin typing your search above and press return to search.

రాజు గారు... సైకిల్ జోరు... ?

By:  Tupaki Desk   |   16 Oct 2021 11:00 AM GMT
రాజు గారు... సైకిల్ జోరు... ?
X
ఆయన రాజులకే రాజు. రాజు అంటే సినిమాల్లోనో లేక పదవులు ఉన్నాయనో రాజు గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఘనత వహించిన పూసపాటి వంశానికి అసలు సిసలు వారసుడు. ఆయనే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. ఆయన వయసు ఏడు పదులు దాటింది కానీ హుషార్ మాత్రం ఎపుడూ పాతికేళ్ళ యువకుడితో పోటీగానే సాగుతుంది. ఆయనకు ఉన్న జోష్ కానీ జోవియల్ గా ఉండే తీరు కానీ నేటి యువతరానికి లేదు అనే చెప్పాలి. టీడీపీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరిగా రాజు గారిని చెప్పుకోవాలి. ఆయన సీనియర్ మోస్ట్ నేతగా టీడీపీలో అధికమైన మర్యాదలు అందుకుంటున్నారు. ఇక విజయదశమి రోజు అందరూ ఆయుధ పూజ చేశారు. రాజు గారు దానితో పాటుగా తన పార్టీకి ఆయుధంగా ఉన్న టీడీపీ సైకిల్ గుర్తుకు కూడా పూజ చేశారు. అంతే కాదు సైకిలెక్కి మరీ విజయనగ‌రం మహారాజా కోట ప్రాంగణంలో ఉత్సాహంగా తెగ జోరుగా తొక్కేశారు.

రాజు గారి ఊపు చూసిన వారు వచ్చే ఎన్నికల్లో జిల్లాలో టీడీపీని గెలిపించడం ఖాయమని అపుడే జోస్యాలు చెప్పేసుకుంటున్నారు. టీడీపీకి జిల్లాలో ఎంతమంది ఉన్నా కూడా రాజు ఉంటేనే కళాకాంతులు అన్నది నిజం. ఆయన అందరి వాడు, అన్ని వర్గాల వాడు. పూసపాటి సంస్థానం భూములు కూడా అందరికీ పంచేసిన దాతలు వారు. అలాంటి రాజుని కేవలం కులం కార్డు పెట్టి సొంత పార్టీలో పక్కన పెట్టడం కూడా తప్పే అన్న వారు ఉన్నారు. ఆయన పెద్దరికం, రాజరికమే టీడీపీకి శ్రీరామరక్ష అంటున్నారు.

మొత్తానికి టీడీపీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉంటూ డెబ్బైలు దాటిన వయసులో కూడా పార్టీ కోసం పనిచేస్తున్న రాజు గారి సారధ్యం మరోమారు టీడీపీకి కావాలని అంతా గట్టిగా కోరుకుంటున్నారు. విజయదశమి శుభవేళ ఆయన కూడా సైకిలెక్కి స్పీడ్ పెంచేశారు. ఇక ఈ దూకుడు ఆగేది కాదు అంటూ ప్రత్యర్ధులకు గట్టి సవాలే విసిరారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఎన్నికల్లో ఆయన తన కుమార్తె అదితి గజపతిరాజుని ఎమ్మెల్యేగా పోటీకి దింపాలనుకుంటున్నారు. అదే టైమ్ లో విజయనగరం ఎంపీగా తాను మరోమారు పోటీకి కూడా సిద్ధపడుతున్నారు. ఈసారి వార్ వన్ సైడ్ గా జిల్లాలో సాగుతుందని టీడీపీ నేతలు అశోక్ అభిమానులు అంటున్న నేపధ్యంలో రాజా వారు ఆయుధ పూజ చేశారు. ఆయుధాలనూ బయటకు తీశారు, ఇక ఎన్నికల్లో వైసీపీతో సమరమే అంటున్నారు. చూడాలి మరి విజయనగరం జిల్లా రాజకీయాలు ఏ కీలకమైన‌ మలుపు తిరుగుతాయో.