Begin typing your search above and press return to search.

ఈ వయసులో ఇవి అవసరమా అశోక్ గజపతి?

By:  Tupaki Desk   |   9 May 2016 5:32 AM GMT
ఈ వయసులో ఇవి అవసరమా అశోక్ గజపతి?
X
ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవటానికి కారణం ఎవరని ఏపీలోని చిన్న పిల్లాడ్ని ప్రశ్నించినా.. మోడీ పేరు చెప్పటం ఖాయం. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వెంకయ్య ఇచ్చిన హామీ.. 2014 ఎన్నికల సమయంలో మోడీ స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రజల మనసుల్లో ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆ విషయాన్ని మరిచిపోయి.. ప్రత్యేక హోదా సాధ్యం కాదన్న విషయాన్ని బీజేపీ నేతలు కొంతకాలంగా పరోక్షంగా వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఈ మధ్యన కేంద్రమంత్రులు ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్న విషయాన్ని ఏకపక్షంగా తేల్చేయటంపై తీవ్రఆగ్రహాలు వ్యక్తమయ్యాయి.

ప్రత్యేక హోదా మీద కేంద్రమంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఏపీ అధికారపక్ష నేతలుసైతం తీవ్రంగా మండిపడుతూ.. మోడీ సర్కారుపై విమర్శనాస్త్రాల్ని సంధించటం తలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు చిత్రమైన విషయాల్ని చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన బిల్లులో చేర్చి ఉంటే సరిపోయేదని..ఆ పని కాంగ్రెస్ చేయలేదంటూ విమర్శలు చేస్తున్నగజపతి రాజు.. ఏపీకి ప్రత్యేకహోదాను ముగ్గురు ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారంటూ కొత్త విషయాన్ని తెర మీదకు తెచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటాన్ని తమిళనాడు.. కర్ణాటక.. బీహార్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. విభజన బిల్లులో కానీ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చి ఉన్నట్లైయితే..ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని.. ఎవరూ అడ్డుకునే వారు కాదంటూ కొత్త రాగం తీయటం విశేషం. పెద్దమనిషిగా కనిపించే అశోక్ గజపతి రాజు చెప్పిన మాటలు వింటున్న కొందరికి షాక్ తగులుతున్న పరిస్థితి. ఎందుకంటే.. అశోక్ గజపతి మాటలే నిజం అనుకుంటే.. విశాఖకు రైల్వే జోన్ అంశం విభజన చట్టంలో స్పష్టంగా ఉంది? మరి.. కేంద్రం గడిచిన రెండేళ్లుగా ఈ విషయాన్ని ఎందుకు తేల్చటం లేదు? పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత విభజన చట్టంలో ఉంది. మరి.. దానికి చిల్లర పైసలు విసురుతున్నట్లుగా నిధుల కేటాయింపు ఉంది. ఎందుకలా జరుగుతుంది? ఇవే కాదు.. విభజన కారణంగా ఏర్పడే ఏపీ లోటును పూడ్చాలంటూ చాలా స్పష్టంగా విభజన చట్టంలో ఉంది. మరి.. ఎందుకని మోడీ సర్కారు పూడ్చటం లేదు?

ఇలాంటి ప్రశ్నలకు అశోక్ గజపతి సమాధానాలు చెబితే బాగుంటుంది. చేతకానితనాన్ని కవర్ చేయటం తప్పేం కాదు కానీ.. అందుకు భిన్నంగా కొత్త కొత్త పేర్లను తెర మీదకు తీసుకొచ్చి కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం మీదనే అభ్యంతరమంతా? విలువలున్న నేతగా అశోక్ గజపతి మీద చాలామందికి గౌరవం ఉంది. కానీ.. ఈ తరహా మాటలు చెబితే.. ఉన్న గౌరవం పోవటం ఖాయం. ఈ వయసులో ఇలాంటివి ఆయనకు అవసరమా?