Begin typing your search above and press return to search.

రాజు గారు ప‌వ‌న్ గురించి ఏమ‌న్నారంటే..

By:  Tupaki Desk   |   24 March 2018 4:56 PM GMT
రాజు గారు ప‌వ‌న్ గురించి ఏమ‌న్నారంటే..
X
జనసేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌కు అభిమానులు ఊహించ‌ని వార్త‌. ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేవం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు స‌న్నిహితుడ‌నే పేరున్న కేంద్ర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ప‌వ‌ర్ స్టార్ గురించి లైట్ తీసుకునే కామెంట్లు చేసి గ‌తంలో క‌ల‌క‌లం రేకెత్తించిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. పవన్‌ కల్యాణ్‌ ఎవరో త‌న‌కు తెలియదని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే తాజాగా మాట‌మార్చి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెద్ద‌వార‌ని, ఆయ‌న‌కున్న ఫ్యాన్స్ ఫాలొయింగ్ త‌న‌కు లేద‌న్నారు. తాను ఓ సామాన్య కార్య‌క‌ర్త‌న‌ని తెలిపారు.

కొద్దికాలం క్రితం ప‌వ‌న్ ప‌లు అంశాల‌పై ట్వీట్‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. టీటీడీ ఈఓ ఎంపిక‌ను త‌ప్పుప‌డుతూ ఉత్త‌రాది-ద‌క్షిణాది వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్ తీరుపై స్పందించిన అశోక్ గ‌జ‌ప‌తిరాజు ``ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రో నాకు తెలియ‌దు. అతను సినిమా నటుడంటా! నేను సినిమాలు చూసి 20 ఏళ్లయింది`` అని ఎద్దేవా చేశారు. సౌమ్యుడిగా పేరున్న అశోక్ గ‌జ‌ప‌తి రాజు చేసిన వ్యాఖ్య‌లు ఇటు టీడీపీలో అటు జ‌న‌సేన వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారాయి. అయితే, తన మంత్రి పదవికి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రేణులు స్వాగత ఏర్పాట్లు చేశారు. సింహాచల దర్శనం చేసుకున్న అనంతరం తగరపువలస మీదుగా పట్టణానికి చేరుకున్నారు. ఎత్తు బ్రిడ్జి నుంచి కోట వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మూడులాంతర్ల వద్ద శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటాన్నారు. అనంతరం గంటస్తంభం, కన్యకాపరమేశ్వరి, రైల్వే స్టేషన్ మీదుగా అశోక్‌బంగ్లాకు చేరుకున్నారు.

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గ‌జ‌ప‌తి రాజు ప‌వ‌న్ గురించి పూర్తిగా యూట‌ర్న్ తీసుకున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెద్ద‌వార‌ని - ఆయ‌న‌కున్న ఫ్యాన్స్ ఫాలొయింగ్ త‌న‌కు లేద‌న్నారు. ఇక ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వున్న స‌మ‌స్య‌ల‌ప‌ట్ల కేంద్రం ఏమాత్రం స్పందించ‌డం లేద‌న్నారు. భాద్య‌త క‌లిగిన ప్ర‌భుత్వంలో బీజేపీ క‌నిపించ‌డం లేద‌ని అశోక్ గ‌జ‌ప‌తిరాజు అన్నారు. తెలుగువారికి క‌ష్ట‌ప‌డే త‌త్వం - త్యాగం చేసే గుణం ఉంద‌ని - తెలుగువారిని ఇబ్బందికి గురిచేస్తే ఆగ్ర‌హానికి గురికాక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు.

కాగా, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌లి కాలంలో తెలుగుదేశం పార్టీపై - ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై విరుచుకుప‌డుతున్న స‌మ‌యంలో ఆయ‌న‌పై టీడీపీ నేత‌లంతా దూకుడుగా స్పందిస్తున్న స‌మ‌యంలో...అశోక్ గ‌జ‌పతి రాజు ఇలా స్పందించ‌డం ఆశ్చ‌ర్యంగా మారింద‌ని అంటున్నారు. పార్టీకి న‌మ్మిన‌బంటుగా ఉండే అశోక్ త‌మ తాజా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిపై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆయ‌న అందుకు త‌గిన‌ట్లుగా త‌న చాణ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని వివ‌రించారు.