Begin typing your search above and press return to search.

రాజ‌స్థాన్ రాజు...రాహుల్ మార్క్ ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   15 Dec 2018 12:39 PM GMT
రాజ‌స్థాన్ రాజు...రాహుల్ మార్క్ ట్విస్ట్‌
X
రాజస్థాన్ కోటలో రాజెవరు? అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. సుదీర్ఘ మంతనాలు - తర్జనభర్జనలకు తెరదీస్తూ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ (67) పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. యువనేత సచిన్ పైలట్ (41) తుది వరకూ సీఎం పదవి కోసం పట్టుబట్టినా కాంగ్రెస్ పెద్దలు అనుభవానికే పెద్ద పీట వేశారు. పైలట్‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించారు. దీంతో రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఈ మేరకు రాజస్థాన్ ఏఐసీసీ పరిశీలకుడు కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఢిల్లీలో మీడియాకు ఈ వివరాల్ని వెల్లడించారు. సుదీర్ఘ అనుభవం (గెహ్లాట్) - చురుకుదనం (పైలట్) కలిసి రాజస్థాన్‌ను పరిపాలిస్తాయని ఆయన చెప్పారు.

రాజస్థాన్ సీఎం ఎవరనే అంశంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిగాయి. అనుభవజ్ఞుడైన గెహ్లాట్ ఒకవైపు - చురుకైన యువనేత సచిన్ పైలట్ మరోవైపు ఉండడంతో ముఖ్యమంత్రి పీఠం కోసం గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో రాహుల్ పలు దఫాలుగా ...సోనియా - ప్రియాంకలతో చర్చించారు. ఆ తర్వాత రాజస్థాన్ ఏఐసీసీ పరిశీలకుడు వేణుగోపాల్ - నేతలు అవినాశ్ పాండే - జితేంద్ర ప్రసాద్‌ లతో ఆయన సమావేశమయ్యారు. గెహ్లాట్ - సచిన్‌ లతోనూ మూడు దఫాలుగా రాహుల్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చివరకు గెహ్లాట్‌ కు కుర్చీ ద‌క్కింది. అయితే, గెహ్లాట్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఇది మూడోసారి. ఈ సందర్భంగా గెహ్లాట్ - సచిన్ పైలట్ కలిసి మీడియాతో మాట్లాడారు. తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినందుకు అధిష్ఠానానికి - రాహుల్ - సోనియాలకు గెహ్లాట్ కృతజ్ఞతలు తెలిపారు. రాజస్థాన్ ప్రజలకు సేవ చేసేందుకు మూడోసారి సీఎంగా నాకు అవకాశం కల్పించిన రాహుల్‌కు ధన్యవాదాలు. నేను, సచిన్ ఇద్దరం కలిసి ప్రజలకు సుపరిపాలనను అందజేస్తాం. 2019 ఎన్నికలు మా ముందున్న అతి పెద్ద సవాలు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అని అన్నారు. సీనియర్ నేత గ్లెహాట్‌ తో కలిసి రాష్ట్రంలో అద్భుతాలు సృష్టిస్తామని సచిన్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, మేనిఫెస్టోను వెంటనే అమలు చేస్తామని చెప్పారు. గవర్నర్‌కు ఎమ్మెల్యేల జాబితాను అందజేసిన అనంతరం ప్రమాణస్వీకారం తేదీని ప్రకటిస్తామని చెప్పారు.

200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో ఎన్నికల సమయంలో ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో కాంగ్రెస్‌కు 99 సీట్లు - బీజేపీ-73 - బీఎస్పీ-6 - ఆర్‌ ఎల్‌ డీ-1 - స్వతంత్రులు-20 స్థానాల్లో గెలిచారు. ప్రభుత్వ ఏర్పాటుకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఆర్‌ ఎల్‌ డీ ఇప్పటికే కాంగ్రెస్‌ కు మద్దతు ప్రకటించింది. కాగా, సీఎంల ఎంపిక పూర్త‌యిన అనంత‌రం రాహుల్ ఓ ట్వీట్‌ చేశారు. చర్చలు సఫలమయ్యాయని పేర్కొంటూ ఒక ఫొటోను రాహుల్ ట్విట్టర్‌ లో పోస్ట్ చేశారు. గెహ్లాట్ - సచిన్‌ ల మధ్యలో రాహుల్ నిల్చుని ముగ్గురూ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోకు యునైటెడ్ కలర్స్ ఆఫ్ రాజస్థాన్ అనే క్యాప్షన్ పెట్టి శుక్రవారం పోస్ట్ చేశారు.