Begin typing your search above and press return to search.

ఎంపీటీసీగా గెల‌వలేని వ్య‌క్తిని ఎమ్మెల్యే చేస్తే...

By:  Tupaki Desk   |   28 May 2016 5:37 AM GMT
ఎంపీటీసీగా గెల‌వలేని వ్య‌క్తిని ఎమ్మెల్యే చేస్తే...
X
రాజ‌కీయాల్లో విశ్వ‌స‌నీయ‌త‌కు - నాయ‌క‌త్వానికి అండ‌గా ఉండ‌టానికి ఇదో నిద‌ర్శ‌నం. ప్ర‌జాబ‌లం లేని నాయ‌కుడిని ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ గెలిపిస్తే సంద‌ర్భం చూసుకొని జంప్ చేసిన తీరుకు ప్రకాశం జిల్లా గిద్ద‌లూరు ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి వ్య‌వ‌హార‌శైలి స‌రైన ఉదాహ‌ర‌ణ అని నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు అంటున్నారు. వైసీపీ నుంచి గెలిచిన అశోక్‌ రెడ్డి తాజాగా టీడీపీలోకి ఫిరాయించుతున్న నేప‌థ్యంలో ఈ చ‌ర్చ జ‌రుగుతోంది.

రెడ్ల ప్రాబ‌ల్యం అధికంగా ఉండే గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో 2014 సార్వ‌త్రిక ఎన్నిల‌క సంద‌ర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ త‌న పార్టీనుంచి అశోక్‌ రెడ్డికి అవ‌కాశం ఇచ్చారు. ఆర్థికంగా స్థోమ‌త పెద్ద‌గా లేకున్నా త‌న త‌ర‌ఫునుంచి ఆదుకోవ‌డం ద్వారా ఆయ‌న్ను గెలుపు తీరానికి చేర్చారు. అశోక్‌ రెడ్డి ఎంపీటీసీగా బ‌రిలో నిలిచిన‌పుడు 200 ఓట్లు కూడా సంపాదించ‌లేని నాయకుడు. వైసీపీ ద్వారా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్ర‌స్తుతం ఆక‌ర్ష్‌ లో భాగంగా ఆయ‌న అధికార టీడీపీ గూటికి చేరుతుండ‌టం అటు వైసీపీలోనే కాదు ఇటు టీడీపీలో కూడా విస్మ‌యం క‌లిగిస్తోంది. అయితే ఇదే స‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌తో పార్టీ మారుతున్న నాయ‌కులు అశోక్‌ రెడ్డి ముందు ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌తిపాద‌న ఉంచుతున్నారని స‌మాచారం.

"అధికార పార్టీలోకి మారుతున్నందుకు ప్యాకేజీ ఇస్తున్నారంట క‌దా. అందులో మాకు కూడా వాటా ఇస్తే బాగుండు" అంటూ అశోక్‌ రెడ్డి ముందు డిమాండ్‌ లు పెడుతున్నార‌ట‌. అంతేకాకుండా నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే మాత్ర‌మే వైసీపీ నుంచి టీడీపీలోకి మారుతున్నాడే త‌ప్ప తాము కాద‌ని జ‌గ‌న్ పార్టీ నాయ‌కులు స్ప‌ష్టం చేస్తున్నారు. మొత్తంగా ఎమ్మెల్యే గారి ఫిరాయింపు ఆస‌క్తిక‌ర రాజ‌కీయంగా మారింది.