Begin typing your search above and press return to search.

గిద్దలూరు ఎమ్మెల్యే సైకిల్ ఎక్కుతారా? లేదా?

By:  Tupaki Desk   |   21 April 2016 6:29 AM GMT
గిద్దలూరు ఎమ్మెల్యే సైకిల్ ఎక్కుతారా? లేదా?
X
ఏపీలో ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. జిల్లాల వారీగా ఎమ్మెల్యేల్ని సైకిల్ ఎక్కించే కార్యక్రమం జోరుగా సాగుతోంది. అధికారపక్షం వైపు ఆశగా చూస్తున్నారన్న సమాచారం అందిన వెంటనే.. తమ్ముళ్లు రంగంలోకి దిగా మంతనాలు జరపటంతో పాటు.. భవిష్యత్ కార్యాచారణ మీద చర్చలు జరపటం.. భవిష్యత్తుకు సంబంధించిన కమిట్ మెంట్ల గురించి ఓపెన్ గా మాట్లాడేయటం లాంటివి చేస్తున్నారు.

2019 ఎన్నికల్లోనూ చంద్రబాబే ముఖ్యమంత్రి కావటం ఖాయమైన నేపథ్యంలో.. అధికారపక్షంలో భాగస్వామ్యం కావటం లాభమన్న మాట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే పలు జిల్లాలకు చెందిన పలువురు జగన్ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరుగా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా వార్తా కథనాలు వినిపిస్తున్నాయి. అయితే.. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే జంపింగ్ విషయంలో కొత్త కోణం కనిపించింది.

ఆయన రాకను తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దంటూ తెలుగు తమ్ముళ్లు టీడీపీ హెడ్ క్వార్టర్ కు వచ్చి మరీ ఆయనపై ఫిర్యాదు చేయటంతో ఆయన ఎంట్రీ ఉంటుందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర జిల్లాల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ అశోక్ రెడ్డి విషయంలో బయటకు వచ్చిన వ్యతిరేకత మిగిలిన చోట్ల రాలేదనేచెప్పాలి.

ఇదిలా ఉంటే.. తాజాగా అశోక్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తమ మనోభావాలు దెబ్బ తినేలా కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న అశోక్ బాబు తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రత్యర్థి అన్నా రాంబాబు వర్గం తన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ.. అశోక్ రెడ్డి సైకిల్ ఎక్కే విషయంలో పునరాలోచనలో పడినట్లుగా సమాచారం. ఇప్పటికిప్పుడైతే గిద్దలూరు ఎమ్మెల్యే ఎంట్రీ ఉండకపోవచ్చన్న మాట వినిపిస్తోంది.