Begin typing your search above and press return to search.

టీ తాగితే రూ.35లక్షల మూల్యాన్ని చెల్లించాలా?

By:  Tupaki Desk   |   17 Oct 2019 5:46 AM GMT
టీ తాగితే రూ.35లక్షల మూల్యాన్ని చెల్లించాలా?
X
ఇవాల్టి రోజున ఎవరూ ఎవరిని నమ్మలేని పరిస్థితి నెలకొంది. అలా అని అదే పనిగా అపనమ్మకంతో.. తరచూ అసహనపడిపోతూ ఆయాసపడాల్సిన అవసరం కూడా లేదు. కాకుంటే.. కాస్త జాగ్రత్తగా వ్యవహరించటంతో పాటు.. కొన్ని విషయాల్లో కక్కుర్తికి పోకుండా ఉండాల్సిన అవసరం ఎంతన్నది తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు.

హైదరాబాద్ కు చెందిన వ్యాపారి అశోక్ రెడ్డి ఫ్యామిలీ తాజాగా కడప నుంచి నగరానికి వస్తున్నారు. మధ్యలో ప్రయాణ బడలిక నుంచి ఉపశమనం పొందేందుకు వనపర్తి జిల్లా పెబ్బేరు బైపాస్ సమీపంలోని ఒక హోటల్ వద్ద టీ తాగేందుకు ఆగారు. యజమాని కుటుంబం కారులో నుంచి బయటకు దిగింది.

ఇంటి ముసలావిడ తాను కారులోనే ఉండిపోతానని ఉండిపోయారు. టీ తాగుతున్న వేళ.. ఉన్నట్లుండి కారును స్టార్ట్ చేసి సదరు పెద్దావిడతో సహా ఊడాయించాడు కారు డ్రైవర్. అసలు విషయం ఏమంటే..కారులో రూ.35 లక్షల క్యాష్ ఉంది. దాని మీద కన్నేసిన కారు డ్రైవర్.. అదునుకోసం చూసి తుర్రుమన్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కారులో ఉన్న ముసలావిడతో పాటు మాయమైన కారుడ్రైవర్.. కాస్తదూరం వెళ్లి.. పెద్దవిడను.. కారును రోడ్డు మీద వదిలేసి.. తన దారిన తాను వెళ్లిపోయాడు.

రెండు మూడు రోజుల క్రితం మాజీ ఎంపీ.. ప్రముఖ రాజకీయ నేత జేసీ దివాకర్ రెడ్డికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. వ్యాపార పనుల్లో భాగంగా అమరావతి వెళ్లిన ఆయన.. కారులోని బ్యాగులో పెద్ద ఎత్తున క్యాష్ ఉంచటం.. బ్యాగ్ ను హోటల్ రూంలో పెట్టాలంటే.. క్యాష్ కొట్టేసి ఖాళీ బ్యాగ్ పెట్టటం తెలిసిందే.

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారొచ్చి డ్రైవర్ దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేశారు. ఈ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చేలా హైదరాబాద్ వ్యాపారి ఉదంతం ఉండటం గమనార్హం. కారులో భారీ మొత్తంలో క్యాష్ ఉన్నప్పుడు అలాంటి విషయాల మీద చర్చ చేయకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. భరోసాతో చెప్పే మాటలతో లేనిపోని కష్టాలు ఎదురుకావటం ఖాయం. ఇందుకు నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పక తప్పదు.