Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు అశ్వత్థామ భారీ కౌంటర్

By:  Tupaki Desk   |   25 Oct 2019 4:29 AM GMT
కేసీఆర్ కు అశ్వత్థామ భారీ కౌంటర్
X
తన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగే వాటి విషయంలో కీలక స్థానాల్లో ఉండే వారు ఎంత ఆగ్రహంగా ఉంటారన్న విషయం తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే అర్థం కాక మానదు. 48వేల మంది కార్మికులున్న సంస్థను ఒక్క సంతకంతో భవిష్యత్తు తేల్చేయటమే కాదు.. ఆర్టీసీని మూసివేసే దిశగా ఆయన ఆలోచనలు ఉన్నాయన్న విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేశారని చెప్పాలి.

సమ్మెపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ పై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన ఆయన.. ఆర్టీసీ ఏమీ కేసీఆర్ అయ్య జాగీర్ ఎంతమాత్రం కాదని.. ఆయన దురహంకారానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఇలాంటి సీఎంలను చాలామందిని చూశామని..సమ్మెపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చారు.

సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ కు తన మాటలతో భారీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. యూనియన్లను తీవ్రంగా తప్పు పట్టిన సీఎం వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ఆర్టీసీ బతికి ఉందంటే అందుకు కారణంగా యూనియన్లేనని చెప్పారు. కేసీఆర్ దురహంకారానికి పరాకాష్ఠ ఇదేనన్న అశత్థామ.. సమ్మెపై వెనక్కి తగ్గమని.. ఆర్టీసీ కార్మికులు అధైర్యపడొద్దన్నారు.

కార్మికులను అవమానించేలా మాట్లాడిన కేసీఆర్ తీరును ఆయన తప్పు పట్టారు. ఆర్టీసీ ఉద్యోగుల్ని తీసేసే అధికారం ఎవరికి లేదన్న ఆయన.. ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కోర్టు ఊరుకుంటాయా? అని ప్రశ్నించారు. తమవి గొంతెమ్మ కోర్కెలు ఎంతమాత్రం కావని.. యూనియన్లు ఉన్నాయి కాబట్టే ఆర్టీసీ ఆస్తుల్ని కాపాడుకుంటున్నట్లు చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని కరీంనగర్ సభలో కేసీఆరే హామీ ఇచ్చిన వైనాన్నిఆయన గుర్తు చేశారు. సమ్మెపై కేసీఆర్ విరుచుకుపడినప్పటికీ అందుకు ఏ మాత్రం తగ్గనట్లుగా రియాక్ట్ అయిన అశత్థామ తీరు సీఎంసారుకు మరింత మండేలా చేస్తుందనటంలో సందేహం లేదని చెప్పాలి.