Begin typing your search above and press return to search.

రానున్న రోజుల్లో అశ్వత్థామరెడ్డి అండ్ కోపై మస్తు కేసులు

By:  Tupaki Desk   |   26 Oct 2019 6:32 AM GMT
రానున్న రోజుల్లో అశ్వత్థామరెడ్డి అండ్ కోపై మస్తు కేసులు
X
ఆర్టీసీ సమ్మె విషయంలో సీఎం కేసీఆర్ ఎంత సీరియస్ గా ఉన్నారన్న విషయాన్ని ఇటీవల ఆయన ప్రెస్ మీట్ తో అందరికి అర్థమైపోయింది. తిన్నది అరగక చేసేది సమ్మెను ఒక్కమాటలో తేల్చేయటమే కాదు.. సమ్మె ముగింపు కాదు.. సంస్థే మూసేయబోతున్నట్లుగా చెప్పేసిన ఆయన ఆర్టీసీ ఉద్యోగుల్ని షాక్ తినేలా చేశారు.

ఇప్పటివరకూ ఉద్యోగ సంఘాల వారు సమ్మె చేస్తే.. ప్రభుత్వం ఇరుకున పడటం.. వణికిపోవటం..తీవ్ర ఒత్తిడికి గురై.. వారి డిమాండ్లలో వీలైనన్ని చేయటమో.. లేదంటే బ్రతిమిలాడుకొనో..మరో మార్గంలోనో సర్ది చెప్పే ధోరణిని ప్రదర్శించేవారే కానీ.. ఇలా మొదటికంటా పీకిపారే ఆలోచన ఇప్పటివరకూ ఎవరూ చేసింది లేదు.

అందుకు భిన్నంగా కేసీఆర్ మాత్రం ఆర్టీసీ సమ్మె విషయంలో లెక్క తేల్చేయాలన్నట్లుగా ఉన్నట్లు చెప్పాలి. దీనికి తగ్గట్లే తాజా పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తన మాటలతో ఆర్టీసీ జేఏసీ అధినేత అశ్వత్థామరెడ్డి ఆర్టీసీ ఉద్యోగుల్ని మోసం చేస్తున్నారని.. సమ్మె పేరుతో తప్పుదారి పట్టిస్తున్నారంటూ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో డ్రైవర్ ఒకరు కంప్లైంట్ చేయటం.. ఆ వెంటనే అశ్వత్థామరెడ్డిపై కేసు బుక్ చేయటం తెలిసిందే. దాదాపు మూడు వారాలకు పైగా సాగుతున్న ఉద్యమంలో ఉద్యమ అధినేత మీద కంప్లైంట్ చేసే సాహసం.. ఉద్యోగ సంఘాలకు చెందిన వ్యక్తే చేయటాన్ని ఊహించగలమా?

ఇలా ఊహకు అందని రీతిలో చోటు చేసుకునే పరిణామాల వెనుక ఎవరు ఉన్నారు? ఏ శక్తి అండతో ఇలాంటి కంప్లైంట్లు కేసులుగా మారుతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సమ్మె ఇష్యూను ఒక కొలిక్కి తేవాలన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం..సమ్మె విషయంలో గుర్రుగా ఉన్న కొందరు ఉద్యోగుల్ని దగ్గరకు తీసుకోనున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఈ విషయాన్ని ఉద్యోగ సంఘాల వారు ఆరోపించటం గమనార్హం.

వారి అంచనా ప్రకారం రానున్న రోజుల్లో అశ్వత్థామరెడ్డితో సహా ఆర్టీసీ జేఏసీలో కీలక నేతల మీద అదే పనిగా కేసులు పడతాయని.. దాంతో వారిని ఉక్కిరిబిక్కిరి చేయటం ద్వారా సమ్మెను నిర్వీర్యం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఆర్టీసీ సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. మరి.. ఈ వాదనలో వాస్తవం ఎంతన్నది రానున్న రోజుల్లో బుక్ అయ్యే కేసుల లెక్క తేలుస్తుందని చెప్పక తప్పదు.