Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్.. బాబు.. తర్వాత కేసీఆరే-అశ్వినీదత్

By:  Tupaki Desk   |   20 July 2017 4:53 PM GMT
ఎన్టీఆర్.. బాబు.. తర్వాత కేసీఆరే-అశ్వినీదత్
X
ఒక పార్టీ నాయకుడు తమకు బద్ధ శత్రుత్వం ఉన్నట్లుగా భావించే మరో పార్టీ నేతను పొగడటం అరుదుగా జరుగుతుంటుంది. అలా ఎవరైనా మాట్లాడితే జనాలు ఆశ్చర్యంగా చూస్తారు. సినీ నిర్మాత.. తెలుగుదేశం పార్టీ నాయకుడు చలసాని అశ్వినీదత్.. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద అలాగే ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేనప్పటికీ అశ్వినీదత్ తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడే. గతంలో ఆ పార్టీ తరఫున ఎంపీగానూ ఎన్నికయ్యారాయన. అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి కేసీఆర్ మీద ప్రశంసలు కురిపించడం.. అది కూడా విజయవాడలో మీడియాలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

కేసీఆర్ గురించి చెప్పండని విలేకరులు అడగ్గా.. ‘‘ఆయన వ్యవస్థను చక్కగా కంట్రోల్ చేస్తున్నారు. ఆయన పరిపాలనలో శాంతి భద్రతలు చాలా బాగున్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్ గారి హయాంలో.. ఆ తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎలాగైతే హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్టుగా ఉండేదో ఇప్పుడు కేసీఆర్ గారి నేతృత్వంలోనూ అలాగే ఉన్నాయి. గొప్ప వ్యక్తి కేసీఆర్. ఆయన గురించి మనం ఏం మాట్లాడతాం. ఆయన అత్యుత్తమ పాలన అందిస్తున్నారు’’ అని అశ్వినీదత్ అన్నారు. టాలీవుడ్లో డ్రగ్ రాకెట్ గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. ‘‘దాని గురించి నేను కూడా పత్రికల్లో చూసే తెలుసుకున్నా. ఐతే ఎవరో పది మంది పేర్లు పేపర్లో వచ్చాయి కాబట్టి పరిశ్రమ మొత్తం దాని ప్రభావం ఉంటుందని నేననుకోని ఇందులో కుట్ర చేసి పేర్లు ఇరికించారనే మాటను అంగీకరించను. తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు. వాళ్లు పోయినా ఇండస్ట్రీకి వచ్చే నష్టం ఏమీ లేదు’’ అని అశ్వినీదత్ అభిప్రాయపడ్డారు.