Begin typing your search above and press return to search.

పాక్ కి షాక్...ఆసియా‌ క‌ప్ రద్దు..2021కి వాయిదా!

By:  Tupaki Desk   |   10 July 2020 10:36 AM IST
పాక్ కి షాక్...ఆసియా‌ క‌ప్ రద్దు..2021కి వాయిదా!
X
ఈ ఏడాది జరగాల్సిన ఆసియా కప్ దాదాపుగా వాయిదా పడినట్లేనంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పిన మాటలు నిజమైయ్యాయి. కరోనా వైరస్ కారణంగా ఆసియా కప్ 2020ని వాయిదా వేస్తున్నామని ఆసియా క్రికెట్ మండలి గురువారం ప్రకటించింది. దీనితో ఈ ఆసియా కప్ నిర్వ‌హిద్దామ‌నుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ గ‌ట్టిగా షాక్ ఇచ్చింది అని చెప్పాలి. క‌రోనా నేప‌థ్యంలో 2020 ఆసియా‌ క‌ప్ నిర్వహణ సాధ్యం కాదంటూ జూన్ 2021కి వాయిదా వేస్తున్న‌ట్లు ఏసీసీ స్పష్టం చేసింది.

ఇక 2021లో ఈ టోర్నీకి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుందని వెల్లడించింది. బాధ్యతాయుతమైన రీతిలో టోర్నిని నిర్వహించడానికే ఏసీసీ ప్రాధాన్యమిస్తుంది. 2021 జూన్‌లో ఈ మెగా టోర్నిని నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపింది. ఏసీసీ ప్రకటనతో 2020 టోర్నీ హక్కుల్ని పాకిస్తాన్.. శ్రీలంకకు బదిలీ చేసింది. వాయిదాపడిన టోర్నీని శ్రీలంక నిర్వహించాల్సి ఉంటుంది. 2022లో పాకిస్తాన్ ఆసియా కప్‌ కు ఆతిథ్యమిస్తుందని ఏసీసీ వెల్లడించింది.

ఇదిలావుంటే.. ఏసీసీ స‌మావేశానికి ఒక‌రోజు ముందే బీసీసీఐ అధ్య‌క్షుడు గంగూలీ ఓ మీడియా ఛానెల్‌ తో మాట్లాడుతూ క‌రోనా వ్యాప్తి కారణంగా ఆసియా క‌ప్ ర‌ద్దు కానుందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే గంగూలీ మాటలను పాక్ బోర్డ్ సభ్యులు కొట్టిపారేశారు. గంగూలీ మాటలు గాలి మాటలు అంటూ ఎద్దేవ చేశారు. కానీ ఒక్క రోజు గడిచిందో లేదో. దాదా చెప్పిందే నిజమైంది. గంగూలీ చేసిన వాఖ్య‌ల‌ను నిజం చేస్తూ ఆసియా క‌ప్‌ను వ‌చ్చే ఏడాది కి వాయిదా వేయాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం విశేషం. ‌ తాజాగా టోర్నీ ని వాయిదా వేయాల‌ని ఏసీసీ నిర్ణ‌యం తీసుకోవ‌డం తో ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు రూట్ మరింత క్లీయర్ అయ్యింది.