Begin typing your search above and press return to search.

డిగ్రీ చ‌ద‌వుకున్నా లా పాస‌యిన రాష్ర్ట‌ మంత్రి

By:  Tupaki Desk   |   13 Dec 2015 6:21 AM GMT
డిగ్రీ చ‌ద‌వుకున్నా లా పాస‌యిన రాష్ర్ట‌ మంత్రి
X
రాజ‌కీయ జీవితంలో ఉన్నవారి ఆలోచ‌న‌లు. వారి అత్యుత్సాహాన్ని చూస్తే త‌క్కువ సందర్భాల్లో ముచ్చ‌ట‌వేసి ఎక్కువ సంద‌ర్భాల్లో చికాకు క‌లుగుతుంది. ప్ర‌జాసంక్షేమం కోసం అంటూ క‌ల‌రింగ్ ఇస్తూ వారు చేస్తున్న ప‌నుల వెనుక ఏకైక ఉద్దేశం వారి అభివృద్ధే అయితే...వారు చేస్తున్న ప‌నులు సిల్లీగా ఉండి దొరికిపోతుండ‌ట‌మే అస‌లు కామెడీ!

కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హత సర్టిఫికేట్ల రగడ చల్లారకముందే.. తాజాగా మ‌రో రాష్ర్ట మంత్రి తాలుకు విద్యార్హ‌త‌ల ర‌చ్చ తెర‌మీద‌కు వ‌చ్చింది. జ‌మ్మూ కాశ్మీర్ రాష్ర్టంలో బీజేపీతో పొత్తుకట్టి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన‌ పీడీపీకి చెందిన మ‌హిళా మంత్రి అలాంటి సర్టిఫికేట్ల వివాదంలో ఇరుక్కున్నారు. జమ్మూకాశ్మీర్‌ సామాజిక సంక్షేమశాఖ మంత్రి ఆసియా నక్ష్‌ సమర్పించిన విద్యార్హతల వివరాలను బట్టి ఆమె గ్రాడ్యుయేట్‌ కావడానికి ముందే ఎల్‌ ఎల్‌ బీ పట్టా సాధించింది!! ఆమె స‌మ‌ర్పించిన వివ‌రాల ప్ర‌కార‌మే....ఆసియా 1992లో ఎల్‌ ఎల్‌ బీ పూర్తి చేశారు. 1996లో బీఏ పాసయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికలపుడు ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌ లో ఆమె ప్రస్తావించారు. అఫిడ‌విట్‌ లోని సీరియల్‌ నెంబర్‌ 10 పార్ట్‌-1లో 1996లో కమిషనర్‌ విద్యాలయ నుంచి బీఏ పూర్తి చేశారు. పార్ట్‌-2లో 1992లో విశ్వవిద్యాలయ కమిషనర్‌ నుంచి ఎల్‌ ఎల్‌ బీ డిగ్రీ అందుకున్నారు. ఒకవేళ ఇంటర్మీడియట్‌ తర్వాత న్యాయవాద పట్టా తీసుకోవాలనుకున్నా కనీసం ఐదేండ్లు పడుతుంది. అయితే ఈ పద్ధతి ఆసియా నక్ష్‌ చదివినప్పుడు లేదని విద్యా రంగ నిపుణులు అంటున్నారు.

డిగ్రీ పూర్తి చేయకుండానే న్యాయవాద డిగ్రీ ఆమెకు ఎలా వచ్చింది? ఎప్ప‌ట్లాగే రాజ‌కీయ నాయ‌కులే చెప్పే స్టాండ‌ర్డ్ డైలాగ్ అయిన టైపింగ్‌లో జరిగిన లోపం అనే ప‌ద‌మే ఈ మంత్రి కూడా ఉప‌యోగిస్తారా? అనే సెటైర్లు కూడా పేలుతున్నాయి. ఆసియా న‌కిలీ ప‌త్రాల వ్య‌వ‌హారం ఇపుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. సామాజిక సంక్షేమ శాఖ మంత్రికి ఇంత సామాజిక స్పృహ ఎలా వ‌చ్చింద‌ని ప్ర‌శ్నిస్తూ...ఈ సర్టిఫికేట్లు ఎలా వచ్చాయో చెప్పాలని విపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.