Begin typing your search above and press return to search.

50 ల‌క్ష‌లు ఉంటే కార్పొరేట‌ర్ సీటు అడ‌గండి.. సెల‌విచ్చిన మాజీ మంత్రి!

By:  Tupaki Desk   |   10 March 2021 1:30 AM GMT
50 ల‌క్ష‌లు ఉంటే కార్పొరేట‌ర్ సీటు అడ‌గండి.. సెల‌విచ్చిన మాజీ మంత్రి!
X
ప‌ద‌వి అంటే.. ప్ర‌జ‌ల‌చే ఎన్నిక‌వ‌డం కాదు.. ప్రజల నుంచి కొనుక్కోవ‌డ‌మేన‌ని బాహాటంగా ప్ర‌క‌టించేశారు మాజీ మంత్రి వ‌ర్యులు! రాజ‌కీయాలు డ‌బ్బుతోనే న‌డుస్తున్నాయ‌న్న న‌గ్న‌స‌త్యాన్ని కార్య‌క‌ర్త‌ల‌కు తెలియ‌జెప్పాల‌నుకున్నారో.. లేదంటే.. ముసుగులో గుద్దులాట‌లు ఎందుకులే అనుకున్నారోగానీ.. కార్పొరేట‌ర్ ప‌ద‌వికి పోటీ చేయాలంటే ఎంత ఖర్చు చేయాలో చెప్పేశారట‌! పాలిటిక్స్ య‌మా కాస్ట్లీ అయిపోనాయిగాన త‌క్కువ‌లో త‌క్కువ రూ.50 ల‌క్ష‌లు వెచ్చిస్తే త‌ప్ప‌, గెలిచే ఛాన్స్ లేదని అన్నారట.

ఆయ‌న ఎవ‌రో కాదు వైసీపీ నేత‌, మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల కోలాహ‌లం సాగుతున్న విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో రాష్ట్రంలో 12 కార్పొరేష‌న్ల‌కు, 71 పుర‌పాల‌క‌, న‌గ‌ర పాల‌క సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అయితే.. న్యాయ వివాదాల కార‌ణంగా శ్రీకాకుళం కార్పొరేష‌న్ కు మాత్రం ఎన్నిక‌లు జ‌ర‌గ‌ట్లేదు. అన్నీ సెట్ అయ్యాక ఏప్రిల్ లో ఎన్నిక జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో ముంద‌స్తుగా ఎన్నిక‌ల స‌న్నాహాలు చేప‌ట్టింది వైసీపీ. తాజాగా.. అక్క‌డి నేత‌ల‌తో ఆ పార్టీ నేత, మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు స‌మావేశం అయ్యారట‌. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ.. రాబోయే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఆయ‌న ప‌లు వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. సిక్కోలు కార్పొరేట‌ర్లుగా పోటీ చేయాల‌ని భావించేవారు ఎవ‌రైనా.. మినిమం రూ.50 ల‌క్ష‌లు సిద్ధం చేసుకోవాల‌ని సూచించారట‌. ఎన్నిక‌ల ఖ‌ర్చు కోసం పార్టీ నుంచి ఎలాంటి నిధులూ అంద‌వ‌ని చెప్పారని‌.. ఎవ‌రి పాట్లు వారే ప‌డాల‌ని నాయ‌కుల‌కు నేరుగా చెప్పేశార‌నే ప్ర‌చారం సాగుతోంది శ్రీకాకుళంలో.

ఈ వ్యాఖ్య‌లు విన్న‌వారు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారని తెలుస్తోంది. ల‌క్ష‌లు చేతిలో పట్టుకుంటే త‌ప్ప, టిక్కెట్టు ఖరారు కాద‌ని చెప్ప‌డం ద్వారా.. క్యాడ‌ర్ కు ధ‌ర్మాన ఎలాంటి సందేశం ఇస్తున్నార‌ని చర్చించుకుంటున్నారు సొంత పార్టీ నేత‌లు. ఏ పార్టీ అయినా.. నేరుగా ఇలాంటి కామెంట్స్ చేయాల‌నే సూచ‌న‌లైతే ఇవ్వ‌దు. పైగా.. అధికార పార్టీ ఇలాంటి విష‌యాల్లో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటుంది. ఏ మాత్రం అవ‌కాశం దొరికినా.. విప‌క్షాలు భూత‌ద్దంలో పెట్టి చూపించే ప్ర‌య‌త్నం చేస్తాయ‌ని తెలిసిందే. మ‌రి, ఒక అధికార పార్టీ నేత‌గా ఉన్న మాజీ మంత్రి ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు ఏ ఉద్దేశంతో చేశార‌నే చ‌ర్చ స్థానికంగా సాగుతోంది.

టికెట్ల కేటాయింపులో.. త‌న అనుచ‌రులుగా ఉన్న‌వారికి పోటీ లేకుండా చూసుకునే ఉద్దేశంతోనే ఇలా వ్య‌వ‌హ‌రించారా? లేక మరేదైన కారణం ఉందా? అనే చ‌ర్చ న‌డుస్తోంది. ఏ విధంగా చూసినా.. డ‌బ్బులు పెట్టి ప‌దవులు కొనుక్కోవాల‌నే విధంగా బ‌హిరంగంగా మాట్లాడ‌డం స‌రికాదనే అభిప్రాయం సొంత పార్టీ నుంచే వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి, దీనిపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.