Begin typing your search above and press return to search.
అస్సాంలోకి రావాలంటే ఆ వెబ్ సైట్లో ఎంట్రీ పడాల్సిందే
By: Tupaki Desk | 7 April 2020 11:30 PM GMTకరోనాను కట్టడి చేసేందుకు భారత్ లో విధించిన లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగిసిపోనుందని కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. మరోవైపు, లాక్ డౌన్ పొడిగిచేందుకే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొగ్గుచూపుతున్నారు. లాక్‌డౌన్ కొనసాగించాలంటూ లాక్‌డౌన్ కొనసాగించాలంటూ తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఎకానమీని కొద్ది నెలల్లోనో సంవత్సరాల్లోనో రికవర్ చేయవచ్చని...కానీ, ప్రాణాలు పోతే రికవర్ చేయలేమని కేసీఆర్ సహా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయపడుతున్నారు. దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేతకు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మొగ్గుచూపుతున్నారు. మరో 2 వారాలపాటు లాక్ డౌన్ కొనసాగించాలని కర్ణాటక సీఎం యడ్యూరప్ప అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పందించారు. లాక్‌డౌన్ కొనసాగింపుపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని, వదంతులు వ్యాప్తి చేయవద్దని కోరారు.
మరోవైపు, ఒక వేళ లాక్ డౌన్ ఎత్తివేస్తే అనుసరించాల్సిన వ్యూహంపై అస్సాం పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగుస్తుందని భావిస్తున్న అస్సాం ఓ నిర్ణయం తీసుకోనుంది. లాక్ డౌన్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేకించి ఓ పర్మిట్ వ్యవస్థను ప్రారంభించనుంది. దశల వారీగా వారిని అనుమతించాలని అస్సాం ప్రభుత్వం భావిస్తోందని అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. అందుకోసం ఓ వెబ్ సైట్ ను త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. అస్సాంలోకి రావాలనుకునే ఇతర రాష్ట్రాల ప్రజలు, అస్సాంవాసులు తమ వివరాలను ఆ వెబ్ సైట్ లో పొందుపరుస్తూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలున్నట్టు తేలితే వారిని క్వారంటైన్ సెంటర్లకు పంపుతామన్నారు. వారిలో ఎవరైనా ఢిల్లీలోని మర్కజ్ కు వెళ్లి ఉంటే ఆ సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు. కరోనా లక్షణాలున్నా, కరోనా అనుమానితుల తో కాంటాక్ట్ అయినా...ఆ సమాచారం ఇవ్వాలని...లేకుంటే విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసకుంటామని హెచ్చరించారు.