Begin typing your search above and press return to search.

ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వివాదానికి కేంద్రం కీలక నిర్ణయం .. ఏంటంటే ?

By:  Tupaki Desk   |   2 Aug 2021 8:30 AM GMT
ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వివాదానికి కేంద్రం కీలక నిర్ణయం .. ఏంటంటే ?
X
గత కొన్ని రోజులుగా అసోం, మిజోరం రాష్ట్ర సరిహద్దు వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు విషయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది. అందుకే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాలను పరిష్కారించేందుకు శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులను ఖరారు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సరిహద్దులను నిర్ణయించే బాధ్యతలను నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎన్‌ ఈ ఎస్‌ ఏసీ), డిపార్ట్‌ మెంట్ ఆఫ్ స్పేస్, నార్త్ ఈస్ట్ కౌన్సిల్‌ కు అప్పగించినట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. నెశాక్ నుంచి వచ్చే శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయం జరగనుంది.

రెండు రాష్ట్రాల సరిహద్దు వివాదం నేపధ్యంలో జూలై 26వ తేదీన జరిగిన హింసాత్మక ఘర్షణల్లో అసోంకు చెందిన 5మంది పోలీసులు ప్రాణాలు కోల్పోగా..60 మంది గాయపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా రంగంలో దిగారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. సమస్యకు అర్ధవంతమైన, ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని నిర్ణయించారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయవద్దని కోరారు. సరిహద్దుల నిర్ధారణకు శాస్త్రీయ పద్ధతులు అందుబాటులోకి వస్తే వ్యత్యాసాలకు తావు లేకుండా ఉండటమే కాకుండా అన్నిరాష్ట్రాలు ఆమోదించే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

దశాబ్దాలుగా అసోం, మిజోరం సరిహద్దు వివాదం కొనసాగుతోంది. జులై 27న వివాదం ఘర్షణలకు దారితీసి ఇరు రాష్ట్రాల పోలీసులు ఒకరిపై ఒకరు దాడిచేసుకోవడంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. అసోంలోని కాచర్‌ జిల్లా, మిజోరంలోని కోలాసిబ్‌ జిల్లాల మధ్య ఉన్న సరిహద్దు వద్ద స్థానికులు, భద్రతాసిబ్బంది మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారి ఏడుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం జరిగింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే వివాదం మరింత బిగుసుకుంటుందని కేంద్రం అప్రమత్తమయ్యింది. ఇందులో భాగంగా శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా సమస్యను పరిష్కరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సరిహద్దుల నిర్ధారణలో శాస్త్రీయ హేతుబద్ధత ఉన్నందున ఏ పక్షపాతానికి చోటు ఉండదు.. సరిహద్దు వివాదం పరిష్కారాలకు మెరుగైన ఆమోదం రాష్ట్రాల ద్వారా ఉంటుంది అని వ్యాఖ్యానించారు.