Begin typing your search above and press return to search.

చెన్నై వ‌ర‌ద‌లు న‌ష్టం లెక్క ఇది

By:  Tupaki Desk   |   3 Dec 2015 6:59 AM GMT
చెన్నై వ‌ర‌ద‌లు న‌ష్టం లెక్క ఇది
X
క‌నీవిని ఎరుగని విపత్తు చెన్నై మహానగరాన్ని అతలాకుతలం చేస్తోంది. కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై జలరాకాసి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నది. చెన్నైలో 49 సెం.మీ. వర్షం కురవడం - చెయంబరంబాక్కం రిజర్వాయర్ నుంచి 25వేల క్యూసెక్కుల నీటిని అడయార్ నదిలోకి విడువడంతోపాటు అంతకుముందు నగరంలో 47 సెం.మీ. వర్షం కురవడంతో చెన్నై సముద్రాన్ని తలపించింది. తాజా వర్షాలు వందేళ్ల రికార్డులు బద్దలుకొడుతూ 119.7 సెం.మీవర్షం నమోదైందని వాతావరణ శాఖ వర్గాలు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ వ‌ర్షం ప్ర‌భావంతో రైలు - రోడ్డు మార్గాలు కొట్టుకుపోవడంతో చెన్నై నగరానికి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

ఈ భారీ వ‌ర్షాలతో ఐటీ ప‌రిశ్రమలకు 15 వేలకోట్ల నష్టం వాటిల్లింద‌ని అంచనా. చెన్నైలో కురుస్తున్న వర్షాలు పరిశ్రమలు, ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపాయి అనేందుకు నిద‌ర్శనంగా ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని చెప్పుకోవ‌చ్చు. ఇన్ఫోసిస్ ఆఫీసులోకి వరదనీరు చేరడంతో కార్యకలాపాల‌న్నీ నిలిచిపోయాయి. కాగ్నిజెంట్‌కు చెందిన 2.19 లక్షల మంది ఉద్యోగులు వ‌ర్ష‌బీభ‌త్సం కార‌ణంగా చుక్క‌లు చూస్తున్న ప‌రిస్థితి ఉంది. ఆ సంస్థ‌తో పాటు పెద్ద కంపెనీల‌యిన టీసీఎస్ - మహీంద్రా వంటి పలు కార్యాలయాలు మూతపడ్డాయి. హ్యుందాయ్ - ఫోర్డ్ - రెనాల్ట్ వంటి ఆటోమొబైల్ పరిశ్రమల్లో కూడా కార్యకలాపాలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా పరిశ్రమలకు 15వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అసోచామ్ వెల్లడించింది. ప్ర‌ఖ్యాత ఐబీఎం కంపెనీకి దాదాపు 25వేల మంది ఉద్యోగులు చెన్నైపట్ట‌ణంలో అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఆ కంపెనీ భారతదేశంలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉండగా, వాళ్లలో ఐదోవంతు చెన్నైలోనే పనిచేస్తున్నారు. వెర‌సి చెన్నైలోని సాఫ్ట్‌ వేర్ ప‌రిశ్ర‌మ వ‌ర్ష‌బీభ‌త్సం కార‌ణంగా అత‌లాకుత‌లం అయింది.

భారీ వ‌ర‌ద‌ - వ‌ర్షం కార‌ణంగా వరదనీరు చేరుతుండటంతో విమాన‌శ్ర‌యం రన్ వే నదిని తలపిస్తూ అందులో విమానాలు పడవల్లా కనిపిస్తున్నాయి. దీంతో విమానాశ్రయ అధికారులు అత్యవసర పరిస్థితిని (నోటీస్ టు ఎయిర్‌ మెన్) ప్రకటించారు. ఈ నెల 6వ తేదీ వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ఎయిర్‌ పోర్ట్ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రినుంచే విమానాలను అనుమతించలేదు. విమాన సర్వీసులు రద్దు కావడంతో 700మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. మ‌రోవైపు చెన్నైకి వచ్చే అన్ని రహదారులు దెబ్బతినడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న‌ది. రైలు పట్టాలపైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో 50 రైలు సర్వీసులు రద్దయ్యాయి.