Begin typing your search above and press return to search.

ప్ర‌పంచం వ‌ల‌స వెళ్లాల్సిన టైం వ‌చ్చేసింద‌ట‌

By:  Tupaki Desk   |   22 Jun 2017 7:48 AM GMT
ప్ర‌పంచం వ‌ల‌స వెళ్లాల్సిన టైం వ‌చ్చేసింద‌ట‌
X
మ‌నిషికి పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చింద‌ని చెప్పాలి. ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి వెళ్ల‌టం మామూలే. ఈ వ‌ల‌స‌ల్ని ఎంత చుల‌క‌న‌గా చూస్తారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆ మాట‌కు వ‌స్తే మొద‌టి నుంచి మ‌నిషి సంచార‌జీవి అన్న బేసిక్ విష‌యాన్ని మ‌ర్చిపోయి లోక‌ల్‌.. నాన్ లోక‌ల్ లెక్క మాట‌లు చెబుతుంటారు. అక్క‌డెక్క‌డో ఆఫ్రికాలో మొద‌లైన మ‌నిషి.. త‌ర్వాతి ద‌శ‌ల్లో ప్ర‌పంచం మొత్తానికి విస్త‌రించ‌టం మ‌ర్చిపోలేం. మ‌న మూలాల్లోనే ఉన్న ఈ వ‌ల‌స పోవ‌టాన్ని.. చుల‌క‌న చేస్తూ వ్య‌వ‌హ‌రించే వారు మ‌న చుట్టూ చాలా మందే క‌నిపిస్తారు. ఆ మాట‌కు వ‌స్తే.. ఈ మాయ‌దారి రోగం మ‌న దేశంలోనే కాదు.. వివిధ దేశాల్లోనూ క‌నిపిస్తుంది. ప్ర‌పంచంలోని చాలా దేశాల్లో స్థానికులు.. స్థానికేత‌రుల‌న్న ర‌చ్చ క‌నిపిస్తూనే ఉంటుంది.

మ‌రింత‌గా స్థానిక చ‌ట్రాల్లో కూరుకుపోయిన ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు కొత్త హెచ్చ‌రిక‌ను చేస్తున్న ఖ‌గోళ ప‌రిశోధ‌కులు. భూమిని గ్ర‌హ‌శ‌క‌లం ఢీ కొట్ట‌టం ఖాయ‌మ‌ని.. దీని నుంచి త‌ప్పించ‌లేమ‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. భూమి చుట్టూ ఉన్న అనంత విశ్వం లో లెక్క‌లేన‌న్ని గ్ర‌హ శ‌క‌లాలు తిరుగుతున్నాయ‌ని.. అందులో చాలావ‌ర‌కూ ప్ర‌మాద‌ర‌హిత‌మే అయిన‌ప్ప‌టికి.. ఎప్పుడు ఏ గ్ర‌హ‌శ‌క‌లం విరుచుకుప‌డుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి.

భూమిని ఏదో ఒక రోజు ఏదో ఒక గ్ర‌హ‌శ‌క‌లం ఢీ కొట్ట‌టం ఖాయ‌మ‌ని.. అదే జ‌రిగితే న‌గ‌రాల‌కు న‌గ‌రాలే తుడిచి పెట్టుకుపోతాయి. అందుకే.. ప్ర‌పంచం మొత్తం త‌నకు అనుకూల‌మైన మ‌రో గ్ర‌హాన్ని చూసుకోవాల‌న్న సూచ‌న‌ను చేస్తున్నారు ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు. ఈ విష‌యంలో మ‌నిషిని మ‌రింత‌గా హెచ్చ‌రిస్తున్నారు ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త స్టీఫెన్ హాకింగ్‌. భ‌విష్య‌త్తులో గ్రహాంత‌ర వ‌ల‌స‌ల‌కు వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని.. అందుకు త‌గిన ఏర్పాట్లు ఇప్ప‌టి నుంచే చూసుకోవాలంటూ ఆయ‌న చెబుతున్నారు. మున్ముందు కాలంలో భూమి మీద జీవం సాధ్య‌మ‌య్యే ప‌ని కాద‌ని.. ఇవాళ కాకున్నా.. మ‌రో ప‌ది ల‌క్ష‌ల సంవ‌త్స‌రాల త‌ర్వాత భూగ్ర‌హం మీద జీవం అనేదే ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ప‌రిశోధ‌న‌లు పెంచి.. గ్ర‌హాంత‌ర నివాసం గురించి సీరియ‌స్ గా దృష్టి పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న చెబుతున్నారు. మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవాలంటూ కొత్త గ్ర‌హాల్ని క‌నుగొనాల‌ని.. గ్ర‌హాంత‌రాల‌కు వ‌ల‌స వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. మ‌నిషి ఎక్క‌డి నుంచి మొద‌ల‌య్యాడో మ‌ళ్లీ అక్క‌డికే వెళ్ల‌టమంటే ఇదేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మొత్తం మాన‌వ‌జాతే వ‌ల‌స వెళ్లాల్సిన రోజు ఎప్ప‌టికైనా త‌ప్ప‌ద‌న్న‌ప్పుడు.. ఈ లోక‌ల్‌.. నాన్ లోక‌ల్ ఆలోచ‌న‌ల్ని మ‌నుషులు కాస్త త‌గ్గిస్తే బెట‌రేమో క‌దూ?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/