Begin typing your search above and press return to search.

వ్యతిరేకత ఎలా ఉన్నా.. అద్భుతం జరిగి ట్రంప్ గెలుస్తాడట

By:  Tupaki Desk   |   22 Oct 2020 1:30 PM GMT
వ్యతిరేకత ఎలా ఉన్నా.. అద్భుతం జరిగి ట్రంప్ గెలుస్తాడట
X
సర్వేలు.. అధ్యయనాలు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. అందరూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి ఖాయమని తేల్చేస్తున్న పరిస్థితి. అందుకు భిన్నంగా తాజాగా జ్యోతిష్యులు.. న్యూమరాలజిస్టులు మాత్రం ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. వ్యతిరేకత ఎంత ఉన్నా.. ఇతర అంశాలు మరెన్ని ఉన్నా.. చివరకు గెలుపు మాత్రం ట్రంప్ ఖాతాలోనేనని తేలుస్తున్నారు. అదెలా అంటే.. అందుకు చెబుతున్న వాదన ఆసక్తికరంగా మారింది.

జ్యోతిష్యులు.. న్యూమరాలజిస్టు ల అభిప్రాయం ప్రకారం లైఫ్ పాత్ నంబరు..మాస్టర్ ఇయర్ ఆధారంగా బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల పుట్టిన తేదీల్లో ఉన్న తేడానే వారి విజయాన్ని డిసైడ్ చేస్తుందని చెబుతున్నారు. అదెలానంటే.. పెద్ద థియరీనే వినిపిస్తున్నారు. లైఫ్ పాత్ నంబరు ఆధారంగా చూసి జాతకాలుచెప్పే విధానంలో ట్రంప్ గెలుపు ఖాయమని తేలుస్తున్నారు.

అదెలా అంటే.. ట్రంప్ పుట్టిన తేదీ 14-06-1946. ఇందులోని అంకెల్ని ప్రత్యేక పద్దతిలో లెక్కిస్తే.. చివరకు వచ్చేది 22. ఇది ట్రంప్ లైఫ్ పాత్ నంబరని.. ఈ నెంబరు వచ్చిన వ్యక్తులకు భారీ విజయాలు ఖాయమని చెబుతున్నారు. వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువ అంటున్నారు. వ్యాపారాల్లోనూ.. రాజకీయాల్లోనూ వారు భాగా రాణిస్తారన్న మాట వారి నోట వస్తోంది.

అదే సమయంలో ట్రంప్ కు పోటీగా బరిలోకి దిగిన జోబైడైన్ పుట్టిన తేదీని చూస్తే.. 20-11-1942. ఇందులోని నెంబర్లను ప్రత్యేక పద్దతిలో లెక్కిస్తే చివరకు తేలేది 2. ఇది అత్యంత తక్కువ శక్తి ఉన్న సంఖ్యగా వారు చెబుతున్నారు. ఇలాంటి నెంబరు వచ్చే వ్యక్తులు ఎంత పని చేసినా గుర్తింపు పొందలేరని చెబుతున్నారు. ఇక.. ఎన్నికలు జరుగుతున్న 2020 సంఖ్య కూడా ట్రంప్ కే అనుకూలంగా ఉన్నట్లు తేలుస్తున్నారు. ఏతా.. వాతా.. జ్యోతిష్యులు.. న్యుమరాలజిస్టుల లెక్క ప్రకారం.. గెలుపు ట్రంప్ దే అని. అందులో నిజమెంతో కొంతకాలం వెయిట్ చేస్తే సరిపోతుందిగా?