Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయా?

By:  Tupaki Desk   |   23 May 2020 6:15 AM GMT
హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయా?
X
లాక్ డౌన్ నేపథ్యంలో అన్ని వ్యవస్థలు దాదాపుగా స్తంభించిన వేళ.. ప్రజా రవాణాను నిలిపివేయటం తెలిసిందే. ఇటీవల లాక్ డౌన్ సడలింపుపై నిర్ణయాలు తీసుకోవటంతో.. హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో ఆర్టీసీ సర్వీసుల్ని పునరుద్ధరించారు. జిల్లాల నుంచి హైదరాబాద్ కు ఆర్టీసీ బస్సు సర్వీసు ఉన్నా.. నగరంలో మాత్రం అలాంటి సౌకర్యం లేదు. సిటీలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న వేళ.. సిటీ సర్వీసులు నడపకూడదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది.

ఇదిలా ఉంటే.. ఈ రోజు (శనివారం) నుంచి హైదరాబాద్ మహానగరంలో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ సిటీ సర్వీసులు నడిపేలా నిర్ణయం తీసుకున్నారు. 32 ప్రాంతాల నుంచి 32 సర్వీసుల్ని నడపాలని అధికారులు డిసైడ్ అయ్యారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ బస్సులన్ని హైదరాబాద్ వాసులకు కాదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కావటం గమనార్హం.

లాక్ డౌన్ అనంతరం ప్రభుత్వ కార్యాలయాలు పని చేయటం షురూ చేశాయి. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ఉద్యోగులు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. వారికి కలుగుతున్న ఇబ్బందుల్ని కొంతమేర తగ్గించేందుకు వీలుగా పరిమిత సంఖ్యలో.. పరిమిత రూట్లలో సర్వీసులు నడపాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఎక్కేందుకు అనుమతిస్తారు.

ప్రజారవాణా మీద ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఆధారపడరని.. సామాన్యులు సైతం ఆధారపడతారని.. అలాంటప్పుడు కొందరికే పరిమితం చేయటం సరికాదంటున్నారు. అయితే.. ఇప్పుడు నడుపుతున్న సర్వీసులన్ని కూడా ప్రయోగాత్మకం మాత్రమేనని.. ఈ అనుభవాలతో రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసుల్ని అందుబాటులోకి తేనున్నట్లుగా ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.