Begin typing your search above and press return to search.

వాజ్ పేయి నిష్క్రమణంతో ఒంటరైపోయిన అద్వాణీ

By:  Tupaki Desk   |   16 Aug 2018 5:51 PM GMT
వాజ్ పేయి నిష్క్రమణంతో ఒంటరైపోయిన అద్వాణీ
X

భారతదేశ రాజకీయాల్లో స్నేహానికి చిరునామా వారిద్దరు. ఇద్దరూ ఇద్దరే. వారే అటల్ బిహారీ వాజపేయి, లాల్ కిషన్ అద్వాణీ. ఈ జోడీ దేశ రాజకీయాలపై ప్రత్యేక ముద్ర వేసింది. దేశ రాజకీయాలు ఏకపక్షంగా మిగిలిపోకుండా - ప్రజాస్వామ్య భారతం ఒకే కుటుంబ రాచరిక పాలనలో నలిగిపోకుండా వీరిద్దరి స్నేహం కాపాడింది.. 67 ఏళ్ల వీరి సుదీర్ఘ స్నేహం ఈ దేశానికి ఎంతో చేసింది.. మరెంతో నేర్పింది. ఇప్పుడీ జోడీలో వాజ్‌ పేయి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.. దీంతో అద్వాణీ ఒంటరిగా మిగిలిపోయారు.

వాజ్ పేయి - అద్వాణీ మధ్య వయస్సులో తేడా కేవలం మూడేళ్లు. వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ - గౌరవం ఉండేది. అదేసమయంలో కొన్ని నిర్ణయాలపై ఇద్దరూ విభేదించేవారు కూడా. ప్రజల్లో వీరిపై ఉండే అభిప్రాయాల భిన్నంగా ఉండేవి. అద్వానీ కరడుకట్టిన హిందూత్వ వాదిగా కనిపిస్తే వాజ్ పేయి మాత్రం బీజేపీలో ఉన్న సెక్యులర్ నేతలా అనిపిస్తారు. ఒకరకంగా అది వాస్తవం కూడా.

అటల్ అద్వానీ ఇద్దరు రాష్ట్రీయ స్వయం సేవక్ నుంచే నేతలుగా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చేందుకు ఇద్దరూ కష్టపడ్డారు. ఇద్దరికి సాహిత్యం - జర్నలిజం - సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆర్ ఎస్ ఎస్‌ లో బాగా కష్టపడే వారిని ఆ శాఖ రాజకీయపార్టీ అయిన భారతీయ జనసంఘ్‌ లోకి పంపింది. 1951లో స్థాపించిన ఈ పార్టీ ద్వారా అటల్ అద్వానీ ద్వయం రాజకీయాల్లోకి అరంగేట్రం చేసింది. జనసంఘ్ పార్టీ ఆవిర్భావంలో వీరిద్దరూ భాగస్వాములై అంతా తామై పార్టీని నడపించారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ్ మృతి తర్వాత అప్పటికే పార్లమెంటులో ప్రాతినిథ్యం వహిస్తున్న వాజ్‌ పేయి పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే అద్వానీ కూడా బాధ్యతలను చూశారు. ఎమర్జెన్సీ సమయంలో అటల్ -అద్వానీ ద్వయం జైలు జీవితాన్ని గడిపింది. కాంగ్రెస్‌ ను మట్టి కరిపించిన జనతా పార్టీలోకి జనసంఘ్ పార్టీని విలీనం చేయాలని ఇద్దరూ నిర్ణయించారు. ఆ సమయంలో వాజ్‌ పేయి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. అద్వానీ సమాచార మరియు ప్రసారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఆ తరువాత ఇద్దరు నేతలు జనతాపార్టీ నుంచి బయటకువచ్చి భారతీయ జనతా పార్టీని స్థాపించారు. బీజేపీ తొలి అధ్యక్షుడిగా వాజ్‌ పేయి ఉన్నారు. తొలినాళ్లలో బీజేపీ చాలా కష్టాలు ఎదుర్కొని నిలదొక్కుకుంది. 1980లో పార్టీ పగ్గాలు అద్వానీ చేతికి వచ్చాకా బీజేపీ పుంజుకుంది. హిందూత్వ రాజకీయాలపైనే పార్టీ విస్తరించింది. ఇదే సమయంలో అటల్ బిహారీ వాజ్‌ పేయి కొంత దూరంగా ఉన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం వాజ్‌ పేయి కట్టుబడి ఉన్నారు కానీ... బాబ్రీ మసీదును కూల్చేందుకు అద్వానీ కదిపిన పావులను వ్యతిరేకించారు. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత అద్వానీ ఒక గొప్ప నాయకుడిగా ఫోకస్ అయ్యారు. కొత్త తరం బీజేపీ నాయకులకు అద్వానీ దేవుడిలా కనిపించాడు.

అటల్ బిహారీ వాజ్‌ పేయి- అద్వానీలకు ఒకరి బలం ఒకరికి తెలుసు - ఒకిరి అభిప్రాయాలతో ఒకరు విభేదించేవారు - కానీ ఇద్దరి లక్ష్యాలు మాత్రం ఒకటిగా ఉండేవి. పార్టీ ప్రధాని అభ్యర్థిగా వాజ్‌ పేయి పేరును అద్వానీ ప్రకటించడమే ఇందుకు ఉదాహరణ.ఇక స్పష్టంగా చెప్పాలంటే బీజేపీ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఓ మహావృక్షంలా ఏర్పడిందంటే ఇందుకు కారణం వాజ్‌ పేయి అద్వానీల ద్వయమే.బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ఆనాడు వాజ్‌ పేయి అద్వానీలు ప్రభుత్వంలో పవర్ సెంటర్లుగా నిలిచారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో కొన్ని ఉద్రిక్తత పరిస్థితులను దేశం ఎదుర్కొంది. పలు అంశాలపై ఏకభిప్రాయం కుదరలేదు.అయినప్పటికీ ఇద్దరూ ఎప్పుడూ విడిపోలేదు. దేశ ప్రధానిగా వాజ్‌ పేయి ఉంటే - డిప్యూటీ ప్రధానిగా అద్వానీ బాధ్యతలు చేపట్టారు.2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. క్రమంగా రాజకీయాలకు వాజ్‌ పేయి దూరం అవుతూ వచ్చారు. దీంతో 2009లో ప్రధాని అభ్యర్థిగా బీజేపీ నుంచి అద్వానికి మార్గం సుగుమం అయ్యింది.కానీ, అప్పుడు పార్టీ గెలవకపోగా.. 2014 నాటికి మోదీ తెరపైకి రావడంతో అద్వానీ కలలు కల్లలుగా మిగిలిపోయాయి.

వాజ్‌ పేయి మృతి అద్వానీని ఒంటరివాడిని చేసింది. ఇప్పటికే పార్టీలో ఏమాత్రం విలువలేకుండా చేశారన్న అసంతృప్తి ఆయనలో ఉందంటారు. ప్రధాని పదవిని మోదీ - రాష్ట్రపతి పదవిని కోవింద్ ఎగరేసుకుపోవడంతో అద్వానీ రాజకీయ జీవిత చరమాంకంలో ఒక రకమైన ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఇదే సమయంలో చిరకాల మిత్రుడు వాజ్ పేయి కూడా వీడి వెళ్లడంతో అద్వానీ పూర్తిగా ఒంటరైపోయారు.