Begin typing your search above and press return to search.

ఈ సారి గెల‌వ‌బోమ‌ని వైసీపీ నేత‌లే చెబుతున్నారా?

By:  Tupaki Desk   |   2 Aug 2022 9:31 AM GMT
ఈ సారి గెల‌వ‌బోమ‌ని వైసీపీ నేత‌లే చెబుతున్నారా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ అప్పుడే ఏపీ రాజ‌కీయాల్లో యుద్ద వాతావ‌ర‌ణం నెల‌కొంటోంది. ఓవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష టీడీపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌ను రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య ట్వీట్ వార్ ఓ రేంజులో న‌డుస్తోంది.

వైఎస్సార్సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్, టీడీపీ మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు ఈ ట్వీట్ల వార్ లో ముందంటున్నారు. తాజాగా టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వంపై చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది.

అచ్చెన్నాయుడు చేసిన ట్వీట్ ఈ విధంగా సాగింది... ''గత మూడేళ్లలో దళితులపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు, కల్తీ మద్యం, ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై దాడులు, భూ కబ్జాలు, మైనింగ్ మాఫియా, శ్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మట్టి మాఫియా, కోర్టు ధిక్కారాలు, చెత్త రోడ్లు, పూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధి, లక్షల కోట్లలో ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పులు, అధికార పార్టీ నేతల ఆగడాలు చూసి చూసి, సామాన్య ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు.

ఈ సారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే ఏపీకి సీఎం కావాలి అని. కానీ కేవలం మూడంటే మూడేళ్ళలో సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులకు కూడా జగన్ రెడ్డి నైజం, అతని అసమర్థ పాలన గురించి అర్థమైపోయింది. బహిరంగంగా తమ అసంతృప్తి వెళ్లగక్కడమే కాదు, ఈసారి తమ పార్టీ గెలిచే పరిస్థితి లేనే లేదని వారే స్వయంగా చెబుతున్నారు.'' అని అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.

జ‌గ‌న్ ప‌ని అయిపోయింది, వ‌న్ చాన్స్ ఓవ‌ర్ జ‌గ‌న్ హ్యాష్ ట్యాగులతో అచ్చెన్నాయుడు ఈ ట్వీట్లు చేశారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాద‌న‌డానికి వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య న‌డిచిన సంభాష‌ణ‌ల స్క్రీన్ షాట్ల‌ను ఆయ‌న త‌న ట్వీట్ లో పొందుప‌రచ‌డం విశేషం.

ఈ నేప‌థ్యంలో అచ్చెన్నాయుడు ట్వీట్ కు వైఎస్సార్సీపీ మ‌ద్ద‌తుదారులు, ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు రిప్లైలు ఇస్తున్నారు. టీడీపీకి అంత సీన్ లేద‌ని, వ‌చ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 175కి 175కి సీట్లు వ‌స్తాయ‌ని చెబుతున్నారు. అచ్చెన్న ఒక‌ప్పుడు అన్న పార్టీ లేదు.. బొక్కా లేదు అనే మాటే నిజ‌మ‌వుతుంద‌ని వైఎస్సార్సీపీ నేత‌లు ఎద్దేవా చేస్తున్నారు.