Begin typing your search above and press return to search.

అచ్చెన్నాయుడా? అత్యాశనాయుడా?

By:  Tupaki Desk   |   15 Aug 2016 12:26 PM IST
అచ్చెన్నాయుడా? అత్యాశనాయుడా?
X
మొదటి దానికి మొగుడు లేడంటే కడదానికి కళ్యాణం అని గ్రామాల్లో ముతక సామెత ఒకటుంది. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మాటలు వింటుంటే ఆ సామెత గుర్తొస్తోంది. కాలం కలిసొచ్చి 2014 ఎన్నికల్లో అధికారం అందుకున్న టీడీపీ మళ్లీ 2019 ఎన్నికల నాటికి ఆ విజయం కొనసాగించగలుగుతుందో లేదో ఆ పార్టీ నేతలకే తెలియదు. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలనూ చేర్చుకుంటున్నారు. ఇలా నెక్స్టు ఎన్నికల్లోనే అధికారం దక్కుతుందో లేదో చెప్పలేని సమయంలో అచ్చెన్నాయుడు మాత్రం ఏకంగా ఆకాశానికి నిచ్చెనలేస్తున్నారు. 2050 వరకు టీడీపీయే అధికారంలో ఉంటుందని చెబుతున్నారు. అంటే మరో 34 సంవత్సరాలు టీడీపీ అధికారంలో ఉంటుందన్నది అచ్చెన్నాయుడి లెక్క.

శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ మాట ఆయన చెప్పగానే అక్కడున్నవారంతా పగలబడి నవ్వారట.. విపక్షాలు అనవసర రాద్ధాంతం చేసినా గడచిన రెండేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని ఆయన చెప్పారు. నదుల అనుసంధానం ద్వారా ఏపీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు లభించిందన్నారు. తమ పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడిపై ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని, ఈ కారణంగానే తమ పార్టీ 2050 దాకా అధికారంలో ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే, వరుసగా రెండు టెర్ములు అధికారంలోకి రావడమే కష్టంగా మారుతున్న కాలంలో 35 ఏళ్ల పాటు అధికారం నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదన్నది అందరికీ తెలిసిందే. దేశంలో ప్రస్తుతం సుదీర్ఘకాలంగా అప్రతిహతంగా సాగుతున్న పాలన ఒడిశాలోని నవీన్ పట్నాయిక్ ది - త్రిపురలో మాణిక్ సర్కార్ ది మాత్రమే. మాణిక్ సర్కారు 18 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతుండగా నవీన్ 16 సంవత్సారాలుగా ఆ పోస్టులో ఉన్నారు. ఇటీవల అస్సాంలోనూ మూడు టెర్ముల తరుణ్ గొగోయ్ పాలన ముగిసింది. చివరకు చాలాకాలంగా గుజరాత్ లో పాలన సాగిస్తున్న బీజేపీ కూడా అక్కడ 2001 నుంచే వరుసగా అధికారంలో ఉంది. ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలో 2050 వరకు తమదే అధికారం అనుకోవడం భ్రమంటున్నారు. అంతేకాదు.. ఆ మాటలు చెప్పిన అచ్చెన్నాయుడిని అత్యాశనాయుడు అంటున్నారు నెటిజన్లు.