Begin typing your search above and press return to search.

మీ నాన్న చేసిన మరిచావా జగన్?

By:  Tupaki Desk   |   19 Dec 2015 6:26 AM GMT
మీ నాన్న చేసిన మరిచావా జగన్?
X
రాజకీయాల్లో గతం చాలా కీలకభూమిక పోషిస్తుంది. వర్తమానంలో భవిష్యత్తు కలలు చూపించే నేతలు.. గతాన్ని తమ అవసరానికి తగినట్లుగా వాడుకుంటారు. అందుకే.. వర్తమానంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుందని చెబుతారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా కాస్త వెనుకా ముందుగా నడిచిపోతుంది. కానీ.. అధికారం చేజారిన తర్వాతే తాము చేసిన తప్పులకు.. వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడి మాటల్నే తీసుకుంటే.. ఆయన శనివారం రోజా మీద విరుచుకుపడ్డారు.

శుక్రవారం తాను చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఏడాది పాటు సస్పెండ్ అయిన ఆమె గురించి మాట్లాడిన అచ్చెన్నాయుడు.. రోజా చేసిన పలు వ్యాఖ్యల్ని ప్రస్తావించారు. సభలో సీనియర్లు.. జూనియర్లు ఉండరని.. బుల్లెట్టు దిగిందా? లేదా? అన్నదే ముఖ్యమని ఆమె చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించారు.

సభా నియమాలు తెలుసుకోవాలంటే ఊరికే కోపం రావటంలో అర్థం లేదన్న అచ్చెన్నాయుడు.. స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తమ పార్టీ సభ్యుడు కరణం బలరాంను దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి ఆర్నెల్ల పాటు సస్పెండ్ చేశారన్నారు.

కరణం బలరాం చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు హైదరాబాద్ లో చేయలేదని.. ఎక్కడో ప్రకాశం జిల్లాలో మాట్లాడిన మాటల్ని పట్టుకొని ఆర్నెల్లు సస్పెండ్ చేసిన ఘన చరిత్ర వైఎస్ దని.. అలాంటప్పుడు రోజా విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని విపక్ష నేత జగన్ ఎలా ప్రశ్నిస్తారంటూ ప్రశ్నించారు. చూస్తుంటే జగన్.. తన తండ్రి హయాంలో తీసుకున్న నిర్ణయాల మీద అవగాహన పెంచుకున్న తర్వాత.. అధికారపక్షంపై విరుచుకుపడితే బాగుంటుందేమో.