Begin typing your search above and press return to search.

ధర్మాన దారిలోనే అచ్చెన్నాయుడా...?

By:  Tupaki Desk   |   9 Aug 2015 7:56 AM GMT
ధర్మాన దారిలోనే అచ్చెన్నాయుడా...?
X
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు అదే జిల్లాకు చెందిన వివాదాస్పద మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు బాటలో సాగుతున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కొన్ని చిన్నచిన్న విషయాల్లో చేస్తున్న పొరపాట్ల కారణంగా ఆయనా ధర్మాన దారిలోనే పయనిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అచ్చెన్న అధికార దుర్వినియోగం ఇటీవల ఎక్కువైపోయిందని చెబుతున్నారు. ఆయన తన వ్యవసాయ క్షేత్రానికి ఉపాధి హామీ నిధులతో రోడ్డు వేయించుకున్నారంటూ అక్కడ తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలోనూ ఇలాగే జరిగింది. ఆయన తన ఇంటికి ఏకంగా ఉపాధి నిధులతో తారు రోడ్డు వేయించుకున్నారు. దానిపై తీవ్ర నిరసన వ్యక్తమవడంతో విచారణ జరిపింది. ఆ విచారణలో ఒక విచిత్రమైన వాదన తీసుకొచ్చారు విచారణ జరిపిన అధికారులు. గుర్తు తెలియని వ్యక్తులు ధర్మాన ఇంటికి రాత్రికి రాత్రి రోడ్డు వేసి పారిపోయారని విచారణలో తేల్చారు. ఆ దెబ్బకు ధర్మాన అవినీతి, బరితెగింపుపై మరింత వ్యతిరేకత అక్కడి ప్రజల్లో ఏర్పడింది.

ఇప్పుడు అచ్చెన్న కూడా అదే మాదిరిగా పొలానికి ఉపాధి నిధులతో రోడ్డు వేయించుకోవడంపై వ్యతిరేకత వస్తోంది. కోటబొమ్మాళి మండలంలోని తులసిపేట నుంచి పోలాకి మండలం గాతలవలస వరకూ మంత్రికీ, ఆయన కుటుంబ సభ్యుల పొలాలకు 20 అడుగుల వెడల్పుతో ఉ పాధి హామీ నిధులు ఖర్చుచేసి రోడ్డు వేయించుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు దృష్టికి ఇలాంటివి వెళ్తే అచ్చెన్నకు ఇంతవరకు ఇస్తున్న ప్రయారిటీకి పుల్ స్లాప్ పడడం ఖాయం.